ఢిల్లీ పోలీసులు ‘ప్రభుత్వ తొత్తులు’

జెఎన్‌యు అనుమానితుల జాబితాపై
వామపక్ష నేతల మండిపాటు
న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన హింసాకాండకు సంబంధించి తొమ్మిది మంది అనుమానితుల జాబితాను విడుదలచేసిన ఢిల్లీ పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరించారని వామపక్ష నేతలు శుక్రవారం మండిపడ్డారు. ఆ తొమ్మిది మందిలో ఏడుగురు వామపక్షాల వైపు మొగ్గుచూపినవారేనని వారు పేర్కొన్నారు. జనవరి 5న జరిగిన హింసాకాండలో అనుమానితుల ఫోటోలను ఢిల్లీ పోలీసులు శుక్రవారం విడుదలచేశారు. అయితే అందులో హింసాకాండలో తలకు గాయమైన జెఎన్‌యూఎస్‌యూ అధ్యక్షురాలు అయిషే ఘోష్‌ కూడా ఉండడాన్ని వామపక్ష నేతలు తప్పుపట్టారు. ‘పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు వామపక్ష భావాలవైపు మొగ్గుచూపుతున్న విద్యార్థులు కొనసాగిస్తున్న ఆందోళనను ప్రభుత్వ దెబ్బతీయాలనుకుంటోంది. ఇందుకు తగ్గట్లుగానే ఢిల్లీ పోలీసులు యత్నిస్తున్నారు’ అని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా చెప్పారు. ఆయన హోంమంత్రి అమిత్‌ షాను కూడా ఈ సందర్భంగా విమర్శించారు. ‘బాధితులపైనే పోలీసులు అభియోగాలు మోపారు. ఇది హాస్యాస్పదం. అనుమానితులుగా వామపక్ష భావాలవైపు మొగ్గుచూపిన విద్యార్థులనే పోలీసులు గుర్తించారు. కానీ విద్యార్థులపై దాడి చేసింది తామేనంటూ కొందరు గూండాలు టివి ఛానెళ్ల ముందు కూడా ఒప్పుకున్నారు. మరి దీనిపై ఢిల్లీ పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయడంలేదు? ఇదంతా కేవలం సిఎఎ వ్యతిరేక నిరసనలు దెబ్బతీయడానికి చేస్తున్నదే. హింసాకాండకు ఒడిగట్టిందెవరనేది ప్రజలకు తెలుసు’ అని కూడా రాజా వ్యాఖ్యానించారు. ‘అసలు జెఎన్‌యూలోకి చొరబడి దాడి చేసిన ముసుగు గూండాలెవరనే ప్రశ్నకు పోలీసులు జవాబు చెప్పాల్సి ఉంది. పోలీసులు బయట కాపాలా కాస్తున్నప్పుడు ఆ గూండాలో క్యాంపస్‌లోకి ఎలా ప్రవేశించగలిగారు’ అని కూడా ఆయన ప్రశ్నించారు. ‘ఢిల్లీ పోలీసులు హోం మంత్రి అమిత్‌ షాకు తొత్తు కావడం దురదృష్టకరం. వాస్తవానికి జెఎన్‌యూలో ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలే దాడిచేశారు. దానిపై నేడు ఢిల్లీ పోలీసులు ఒక్క మాట కూడా మాట్లాడ్డంలేదు. ఢిల్లీ పోలీసుల క్రెడిబిలిటీ ఇప్పుడు జీరో అయింది’ అని సిపిఐ(ఎం) పోలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌ పిటిఐ వార్తా సంస్థకు చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?