ఢిల్లీలో కదం తొక్కిన రైతులు

తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన
నేడు వేలాది మంది అన్నదాతలతో పార్లమెంట్ వీధి వరకు ర్యాలీ
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తమ వాణిని వినిపించేందుకు రైతులు కదం తొక్కారు. కరువు నష్టం పరిహారం, రైతు రుణాలు మాఫీ, పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల ఆందోళనలో భాగంగా గురువారం వేలాదిమంది అన్నదాతలు ఢిల్లీ చేరుకున్నారు. రామ్ మైదానం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, పశ్చిబెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా దేశం నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. శుక్రవారం పార్లమెంట్ వీధిలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆనంద్ విహార్, నిజాముద్దిన్, బిజ్వాసన్ రైల్వే స్టేషన్లు, సబ్జి మండి నుంచి ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శనలు నాలుగు మార్గాల ద్వారా రామలీల మైదానం వరకు కొనసాగడంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రైతులు, వ్యవసాయ కార్మికులతో కూడిన 207 సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న అఖిల భారత కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ (ఎఐకెఎస్ ఆధ్వర్యంలో అనేక మంది అన్నదాతలు దేశ నలమూలల నుంచి రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల్లో ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ, సమీప రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా నుంచి ఉదయం 10.30 గంటలకు నిరసన ప్రదర్శనను మొదలు పెట్టినట్లు రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఢిల్లీ శివార్లలోని మంజు కతిల వద్ద కలుసుకొని అక్కడి నుంచి అందరు కలిసి బృందా రామ్ మైదానికి ర్యాలీగా బయలుదేరినట్లు ఎఐకెఎస్ ఢిల్లీ శాఖ నిర్వాహకులు కమ్లా చెప్పారు. వీరంతా సాయంత్రానికి రామ్ మైదానానికి చేరుకున్నారని రైతు సంఘం నాయకులు తెలిపారు. దాదాపు లక్షలమంది రైతులు తరలి వచ్చే అవకాశముందన్నారు. కాగా, ఆత్మహత్య చేసుకున్న తమ సహచరుల పుర్రెలను తీసుకొని నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్లింకింగ్ అగ్రికల్చరిస్ట్ అసోసియేషన్ చెందిన దాదాపు 1200 మంది రైతులు గురువారం తెల్లవారుజామునే ఢిల్లీకి చేరుకున్నట్లు సంఘం నాయకుడు పి. అయ్యకన్ను వెల్లడించారు. శుక్రవారం పార్లమెంట్ వెళ్లేందుకు అనుమతివ్వకపోతే నిరసన చేపడుతామని తమిళనాడుకు చెందిన ఈ సంఘం హెచ్చరించింది. గత ఏడాది కూడా ఈ సంఘం ఆత్మహత్య చేసుకున్న 8 మంది రైతుల పుర్రెలతో జంతర్ మంతర్ వద్ద ఆందోళన నిర్వహించింది. ఢిల్లీలో రెండు రోజుల పాటు రైతులతో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ ర్యాలీ సందర్భంగా గురువారం రామ్ మైదానంలో ప్రముఖ గాయకులు, కవులతో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు ఎఐకెఎస్ వెల్లడించింది. ఇదిలా ఉండగా శుక్రవారం రైతులు రామ్ మైదానం నుంచి పార్లమెంట్ వీధి వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ ర్యాలీకి విస్తృత ఏర్పాట్లను చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ర్యాలీ నేపధ్యంలో ఢిల్లీ నగర శివార్లలోని ఘజియాబాద్, గౌతమ్ నగర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో దళాలను మొహరింపజేశారు. ఢిల్లీకి వచ్చేందుకు ట్రాక్టర్లకు అనుమతి లేదని ఘజియాబాద్ సీనియర్ ఎస్ ఉపేంద్ర అగర్వాల్ పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?