సిఎల్పి విలీనంపై తగ్గిన టిఆర్ఎస్
కేంద్రంలో కాంగ్రెస్ వస్తుందన్న సందేహమే కారణం
లోక్‌సభ ఫలితాలనుబట్టి గులాబీపార్టీ అడుగులు
ప్రజాపక్షం/హైదరాబాద్: కాంగ్రెస్ ఎంఎల్ఎలను చీల్చి టిఆర్‌ఎస్‌ఎల్‌పిలో కలుపుకునేందుకు టిఆర్ఎస్ చేసిన యత్నాలు ఒక్కసారిగా నిలిచి పోయాయి. కేవలం నెలన్నర వ్యవధిలో 11 మంది కాంగ్రెస్ ఎంఎల్ఎలను తన వైపు తిప్పుకున్న అధికారపార్టీ, ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఇందుకు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, లేదా దాని ఆధారిత ప్రభుత్వం అధికారంలోనికి వస్తుందేమోననే వాతావరణమే కారణమని భావిస్తున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్, బిజెపికి మెజారిటీ రాదని, తామే కేంద్రంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో కీలకమవుతామని చెప్పుకున్న టిఆర్ఎస్ జోరు కాస్త ఇప్పుడు తగ్గింది. టిఆర్ఎస్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌కు పెద్దగా స్పందన రాకపోవడం, ఇటీవల సిఎం కెసిఆర్ కలిసిన జెడి (ఎస్), డిఎంకె అధినేతలు కూడా సానుకూలంగా మాట్లాకపోవడంతో ఇరకాటంలో పడింది. పైగా దేశంలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ లేదా బిజెపి వ్యతిరేక ఫ్రంట్ పేరుతో పార్టీలు ఒక్కటయ్యే వాతావరణం నెలకొంది.దీంతో అనివార్యంగా బిజెపి వ్యతిరేక పార్టీలు మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. బిజెపి కూడా తన బలాన్ని కోల్పోయి, మోడీ రెండవసారి అధికారంలోకి రాకపోవచ్చనే వార్తల నేపథ్యంలో టిఆర్ఎస్ కూడా క్రమంగా కాంగ్రెస్ వైపు చూస్తున్న ట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టిఆర్ఎస్ కూడా తన వైఖరిని మార్చుకుంటోంది. ఇందుకు బలం చేకూరే విధంగా కాం గ్రెస్ మద్దతుతో గతంలో యునైటెడ్ ఫ్రంట్ తరహాలో ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని టిఆర్ఎస్ లోకసభ పక్ష ఉపనాయకులు బి.వినోద్కుమార్వ్యాఖ్యానించారు. అలాగే కేంద్రం లో ప్రభుత్వం విషయంలో కాంగ్రెస్‌తో చర్చించేందుకు సిద్ధం తప్ప ఎట్టి పరిస్థితుల్లో బిజెపితో మాట్లాడబోమని టిఆర్ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ కూడా స్పష్టం చేశారు.