డేంజర్‌ బెల్స్‌

మహారాష్ట్రలో రెండో దశ కరోనా విజృంభణ
పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌లు, నైట్‌ కర్ఫ్యూ
కేరళలోనూ పెరుగుతున్న పాజిటివ్‌ కేసులు
అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : కరోనా రెండో దశ మహారాష్ట్రను కుదిపేస్తున్నది. అతి వేగంగా దేశమంతా విస్తరించే ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. ఫలితంగా పలు జిల్లాల్లో మహారాష్ట్ర సర్కారు మళ్లీ లాక్‌డౌన్‌ను ప్రకటించింది. పుణేలో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. అన్ని విద్యా సంస్థలను మూసివేసింది. దేశమంతటా కరోనా కేసులు పెరగ్గా, మహారాష్ట్రతోపాటు కేరళలో కూడా ఈ సంఖ్య భారీగా ఉంది. కాగా, 24 గంటల వ్యవధిలో 90 మంది కొవిడ్‌ కారణంగా మృతి చెందినట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మొత్తం మీద కరోనా డేంజర్‌ బెల్స్‌ మరోసారి మోగుతున్నాయి. కొత్తగా 14,264 కేసులు నమోదుకాగా, వాటిలో 74 శాతం మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే ఉండడం ఆందోళన కలిగిస్తున్నది. కాగా, కరోనా వైరస్‌ మహమ్మారి రెండో సారి విజృంభించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే అమరావతి, యావత్మల్‌ తదితర జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూను అమలు చేస్తున్నది. తాజాగా పుణేలో రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. సోమవారం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. అంతేగాక, మాస్క్‌ ధరించాలనే నిబంధనలను మహారాష్ట్ర సర్కారు తప్పనిసరి చేసింది. లేకపోతే రెండు వందల రూపాయల జరిమానాను ఖరారు చేసింది. ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ఐదు కంటే ఎక్కువ కేసులు నిర్ధారణ అయితే ఆ భవనం మొత్తం మూసివేయాలని ముంబయి అధికారులు నిర్ణయించారు. కరోనా తీవ్రంగా విస్తరిస్తున్న పుణేలో రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు నగర డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావు వెల్లడించారు. సోమవారం నుంచి 28వ తేదీ వరకూ, రాత్రి 11.00 గంటల నుంచి ఉదయం 6.00 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర సర్వీసులు తప్ప అన్ని ఉద్యోగ, వ్యాపార సంస్థలను మూసివేసి ఉంచాలని అధికారులు ఆదేశించారు. రెస్టారెంట్లు సైతం రాత్రి 10.15 గంటలు దాటిన తర్వాత ఆర్డర్లు తీసుకోరాదు. వార్తా పత్రికలు, పాలు, కూరగాయలు, ఆస్పత్రులకు వంటి అత్యవసర సేవలను ఈ ఆదేశాల నుంచి మినహాయింపు ఇచ్చారు. మహారాష్ట్రలో 6,281, కేరళలో 4,650 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గత 24 గంటల్లో మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషమని పేర్కొంది. అయితే, మహారాష్ట్ర, కేరళలో పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండు రాష్ట్రాలతోపాటు చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, జమ్మూ కశ్మీర్లోనూ పాజిటివ్‌ కేసులు భారీగానే పెరుగుతున్నాయని ్వవరించింది. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మోడీ సర్కారు సూచించింది. కరోనా పరీక్షలు, గుర్తింపు, నిరారణ, చికిత్స వంటి ప్రక్రియలను అనుసరించి, కరోనా వైరస్‌ను కట్టడి చేయాలని సూచించింది. ర్యాపిడ్‌ టెస్ట్లో్ల నెగెటివ్‌ వచ్చినవారికి ఆర్‌టిపిసిఆర్‌ పరీక్షలను కూడా చేయించాలని తెలిపింది. మొత్తం మీద దేశంలో మరోసారి రోజువారీ కరోనా వైరస్‌ కేసులు పెరగడం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌, మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్లో పాజిటివ్‌ కేసుల్లో భారీ పెరుగుదల నమోదయ్యింది. మహారాష్ట్రలో కొత్త వేరియంట్స్‌ను గుర్తించారు. ఈ తరహా కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నదని వైద్యులు అంటున్నారు. విదర్భ ప్రాంతంతోపాటు, ముంబయిలో కూడా కొత్త వేరియంట్‌ బయటపడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరస్‌ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మహారాష్ట్రలో ఒక్క రోజే 6,281 కేసులు
మహారాష్ట్రలో శనివారం ఒక్క రోజే 6,281 కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నది. గత 85 రోజుల్లో ఇంత భారీగా పాజిటివ్‌ కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 20,93,913కు చేరింది. అదే విధంగా మొత్తం 51,753 మంది కొవిడ్‌ కారణంగా మృతి చెందారు. దేశ వ్యాప్తంగా కరొనా బాధితుల్లో మృతులు 1.42 శాతంకాగా, మహారాష్ట్రలో మాత్రం ఇది 2.47 శాతం. కొవిడ్‌ నిబంధనలను పెడచెవిన పెట్టడమే కరొనా వైసర్‌ రెండో దశ వ్యాప్తికి ప్రధాన కారణమని మహారాష్ట్రకు చెందిన అధికారులు, వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో ఎక్కువ మంది మాస్క్‌లు ధరించకుండా, సామాజిక దూరాన్ని పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నందు వల్లే కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తున్నదని అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేయడంతోపాటు, సత్వర చికిత్స చేయించుకుంటే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదని వ్యాఖ్యానించారు.

DO YOU LIKE THIS ARTICLE?