135 దేశాలకు విస్తరించిన మహమ్మారి
వెల్లడించిన డబ్ల్యుహెచ్ఒ వారాంతపు నివేదిక
ఐక్యరాజ్యసమితి (ఐరాస): అత్యధికంగా సోకే తీవ్రత కలిగిన కొవిడ్ 19 డెల్టా వేరియంట్ ప్రస్తుతం 135 దేశాలకు వ్యాపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20 కోట్ల మార్కును దాటుతుందని పేర్కొంది. కొవిడ్ పరిస్థితులపై వారాంతపు నివేదికను డబ్ల్యుహెచ్ఒ 3వ తేదీన విడుదల చేసింది. డబ్ల్యుహెచ్ఒ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 132 దేశాల్లో బీటా, 81 దేశాల్లో గామా వేరియెంట్ల కేసులు నమోదయ్యాయి. ఆల్ఫా వేరియెంట్ 182 దేశాల్లో, భారత్‌లో మొదటగా గుర్తించిన డెల్టా వేరియెంట్ 135 దేశాల్లో ప్రభావం చూపించాయి. ఇలా ఉంటే జులై 26 ఆగస్టు 1 వారానికి ప్రపంచంలో 40 లక్షలకుపైగా కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే నెల రోజులకుపైగా కొత్త కేసులలో పెరుగుదల నమోదవుతూ వస్తోందని ఆందోళన వ్యక్తంచేసింది. తూర్పు మధ్యధరా, పశ్చిమ పసిఫిక్ ప్రాంతాల్లో గతవారం కొవిడ్ కేసులు గణనీయంగా పెరగడమే ప్రపంచవ్యాప్త పెరుగుదలకు చాలావరకు కారణమని డబ్ల్యుహెచ్ఒ నివేదిక వెల్లడించింది. ఇక గతవారం కొవిడ్ కారణంగా ప్రపంచంలో 64,000 మరణాలు సంభవించగా, అంతకుముందు వారంతో పోలిస్తే మరణాల రేటు 8% తక్కువ. అయితే మరణాల్లో కూడా పశ్చిమ పసిఫిక్, తూర్పు మధ్యధరా ప్రాంతాల్లోనే పెరుగుదల నమోదవడం గమనార్హం. డబ్ల్యుహెచ్ఒ నివేదిక ప్రకారం గతవారం అమెరికాలో అత్యధికంగా 5,43,420 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 2,83,923 కొత్త కేసులతో భారత్ రెండో స్థానంలో ఉండగా, ఇండోనేసియా (2,73,891). బ్రెజిల్ (2,47,830), ఇరాన్ (2,06,722) దేశాలు ఆ తర్వాత స్థానాలను ఆక్రమించాయి. ఇక దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్రాంతంలో భారత్, ఇండోనేసియా, థాయ్‌లాండ్ దేశాల్లోనే 80% కొత్త కేసులు నమోదుకావడం గమనార్హం. ఇక కొవిడ్ మరణాల్లో ఇండోనేసియా (12,444) మొదటి స్థానంలో ఉండగా, భారత్ (3,800), మయన్మార్ (2,620) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా డెల్టా వేరియెంట్ ఆందోళన కలిగిస్తుండటంతో అల్ప, అధిక ఆదాయ దేశాల్లో టీకాల అంతరాన్ని పూడ్చడానికి కొవిడ్ బూస్టర్ డోస్‌ను కనీసం సెప్టెంబర్ చివరివరకైనా నిలిపివేయాలని డబ్ల్యుహెచ్ఒ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ప్రజల ప్రాణాలను గాలికి వదిలివేయలేం అని డబ్ల్యుహెచ్ఒ డైరెక్టర్ జనరల్ ఘెబ్రయేసస్ స్పష్టంచేశారు.
డెల్టా ప్రమాద ఘంటికలు
RELATED ARTICLES