డిగ్రీ, పిజి పరీక్షలపై తొలగిన అడ్డంకులు

ప్రజాపక్షం / హైదరాబాద్‌  తెలంగాణ వ్యాప్తంగా డిగ్రీ, పిజి చివరి సెమిస్టర్‌ పరీక్షలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయి. అటానమస్‌ కళాశాలల తమకు అనుకూలమైన విధానంలో పరీక్షలు నిర్వహించుకోవచ్చు. అఫిలియేటెడ్‌ కళాశాలల్లో భౌతికంగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. అయితే, ఎవరైనా పరీక్షలు రాయలేకపోయిన వారికి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఇందులో ఉత్తీర్ణులైన వారినీ రెగ్యులర్‌ పరీక్షల్లో పాసయినట్టు పరిగణిస్తామని కూడా చెప్పింది. ఈ విషయాలను నమోదు చేసుకున్న ధర్మాసనం పరీక్షలు ఎలా నిర్వహించాలనేది విధాన నిర్ణయమని, దీని విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అయితే కరోనా వైరస్‌ అదుపులోకి రానందున అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో బుధవారం నుంచి జెఎన్‌టియుహెచ్‌, గురువారం నుంచి ఒయు సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. కొవిడ్‌ వైరస్‌ అదుపులోకి రాలేదని, ఈ పరిస్థితుల్లో ఎంట్రన్స్‌ పరీక్షలు, డిగ్రీ, పిజి పరీక్షలు నిర్వహిస్తే కరోనా బారిన పడే ప్రమాదం ఉందని, పరీక్షలను నిర్వహించరాదని రాష్ట్ర ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు బి.వి. నర్సింగరావు మరొకరు వేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణకు తెరదించుతున్నట్లు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భౌతికంగా పరీక్షలు నిర్వహించాలో, ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించాలో ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటుందని, ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకునేందుకు ఆస్కారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. భౌతికంగా నిర్వహించే పరీక్షలప్పుడు కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా అన్ని స్థాయిల్లోనూ వైద్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేసింది. అనారోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలతో ఎవరైనా పరీక్షలు రాయకపోతే తిరిగి వారందరికీ ప్రభుత్వం సప్లిమెంటరీ నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని, అయితే విద్యా సంవత్సరం నష్టపోకుండా ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. శానిటైజర్‌, మాస్క్‌లను వినియోగించి వైద్య పరంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం తరఫున
అడ్వకేట్‌ జనరల్‌ బి.ఎస్‌. ప్రసాద్‌ వాదిస్తూ అఫిలియేటెడ్‌ కాలేజీల్లో ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించేందుకు సాధ్యం కాదని, భౌతికంగానే (ఆఫ్‌లైన్‌) పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. పరీక్ష పేపర్ల తయారీ, పరీక్షల నిర్వహణ, పేపర్లను దిద్దడం,, వంటివన్నీ సొంతంగా చేసుకునే అటానమస్‌ కాలేజీలు పరీక్షలను ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో .. ఏవిధానంలోనైనా నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తూ లేఖలు రాసిందన్నారు. ఆ లేఖ ప్రతిని హైకోర్టుకు అందజేశారు. ఉస్మానియా టెక్నికల్‌ కాలేజీ, ఉస్మానియా ఇంజినీరింగ్‌ కాలేజీలు అటానమస్‌ కాలేజీలేనని తెలిపారు. జెఎన్‌టియులో ఆఫ్‌లైన్‌లోనే పరీక్షలు నిర్వహిస్తుందని దాని తరఫు న్యాయవాది చెప్పారు. ఇప్పుడు పరీక్షలు రాయలేని వారికి 2 నెలల్లోగా సప్లిమెంటరీ పరీక్షలు పెడుతుందన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌ పాస్‌గానే సర్టిఫికెట్లు జారీ అవుతాయన్నారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ సప్లిమెంటరీ పరీక్షలు జాప్యం అవ్వకుండా వెంటనే జరిపేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇందుకు అనుగుణంగా హైకోర్టు ప్రభుత్వానికి సూచన చేసి ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణ ముగిసినట్లు ఆదేశాలు జారీ చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?