డిఎ రద్దు

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం షాక్‌

న్యూఢిల్లీ: కరువు భత్యం(డిఎ)పై కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌ దారులకు కేంద్రం షాకిస్తూ.. గతంలో ప్రకటించిన డిఎను రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌ దారులకు గతంలో పెంచిన డిఎ, డిఆర్‌ ను నిలుపుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021, జులై వరకు పెంచిన డిఎను నిలిపివేశారు. 2020, జనవరి 1 నుంచి 2021 జూన్‌ 30 వరకు డిఎ బకాయిలు చెల్లింపు కూడా ఉండదని ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. 2021, జూన్‌ 30 వరకు ప్రస్తుతమున్న డిఎ మాత్రమే కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.   కేంద్రం నిర్ణయం వల్ల 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 61 లక్షల మంది పింఛనుదారులపై ప్రభావం పడింది. గత నెలలో పెంచిన కరువు భత్యాన్ని అమలు చేస్తే కేంద్రంపై రూ. 14,595 కోట్ల భారం పడనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని 17 శాతం నుంచి 21 శాతానికి పెంచుతున్నట్లు కేంద్ర కేబినెట్‌ గత నెలలో నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. పెంచిన 4 శాతం డిఎకు కేబినెట్‌ ఆమోదం కూడా తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో కరువు భత్యం పెంపును నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?