HomeNewsBreaking Newsడాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌నూతన సచివాలయం నుంచి పరిపాలన ప్రారంభం

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌నూతన సచివాలయం నుంచి పరిపాలన ప్రారంభం


ప్రజాపక్షం/హైదరాబాద్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ నూతన సచివాలయ భవనాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రారంభించనున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం
1.20 నుంచి 1.30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ తరవాత నూతన సమీకృత సచివాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తారు. ఆ వెంటనే 6వ అంతస్తులోని సిఎం కార్యాలయంలోని ఛాంబర్‌లో కొలువుధీరనున్నారు. అలాగే మధ్యాహ్నం 1.58 గం. నుంచి 2 గంటల 04 నిమిషాల మధ్యకాలంలో తమ తమ ఛాంబర్లలో వివిధ శాఖల మంత్రులందరూ కూడా కొలువుదీరాలని సిఎం ఆదేశించారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో సచివాలయ ఉద్యోగులు ఆహ్వానితులతో కూడిన సమావేశానుద్దేశించి సిఎం కెసిఆర్‌ ప్రసంగించనున్నారు. అందుకు అనుగుణంగా కార్యదర్శులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రభుత్వ యంత్రాంగం, సెక్షన్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు, సిబ్బంది తమతమ ఛాంబర్లు సీట్లల్లోకి చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో సిఎంఓ సచివాలయ సిబ్బందితో పాటు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, ఎంఎల్‌ఎలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, అన్ని శాఖల హెచ్‌ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్‌పిలు, జిల్లా పరిషత్‌, డిసిసిబి, డిసిఎంఎస్‌, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మేయర్లు తదితర మొత్తం సుమారు 2500 మంది వరకు ఆహ్వానితులుగా ఉన్నారు. 2019 జూన్‌ 27న కొత్త సచివాలయం భవన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ శంకుస్థాపన చేశారు. భవనం పైన ఏర్పాటు చేసిన సౌర ఫలకాలతో సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్‌ను సోలార్‌ పద్ధతిలో ఉత్పత్తి చేస్తున్నారు. సచివాలయంలోకి ప్రవేశానికి స్మార్ట్‌ కార్డ్‌ తో కూడిన పాస్‌లను జారీ చేస్తారు. సచివాలయంలో 300 సిసి కెమెరాలు, 300 మంది పోలీసులతో నిఘా ఉంటుంది. కొత్త భవనంలో అత్యుత్తమ సాంకేతికత వినియోగించడం ద్వారా పాలన ఆన్‌లైన్‌ కానుంది. కాగా సందర్శకుల వివరాలన్నీ భద్రతాధికారుల కంప్యూటర్‌ తెరపై క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఆ భద్రతా వలయాన్ని దాటిన తరువాతే ఎవరైనా సచివాలయంలోకి ప్రవేశించగలరు. నిత్యం సుమారు 650 మందికి పైగా భద్రతా సిబ్బంది పహారా కాయనున్నారు. రాత్రీపగలూ నిరంతరాయంగా పనిచేసే పటిష్టమైన సిసిటీవీల కెమెరా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శకులు ముఖ గుర్తింపు (ఫేస్‌ రికగ్నిషన్‌) ద్వారా వారి సమాచారం ఆధార్‌ డేటాతో అనుసంధానమవుతుంది. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో నిక్షిప్తమై ఉండే డేటా ద్వారా సందర్శకుని పూర్తి వివరాలు అప్పటికప్పుడే కంప్యూటర్‌ తెరపై కనిపిస్తాయి. ఆరు అంతస్తులతో నిర్మించిన సచివాలయంలో 635 గదులు ఉన్నాయి. ఏసీ కోసం ప్రత్యేకంగా ఒక ప్లాంట్‌ నే నెలకొల్పారు. 24 లిఫ్ట్‌ లను, అన్ని రకాల అవసరాల కోసం 5.60 లక్షల లీటర్ల నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేశారు. కరెంట్‌ పొదుపునకు సోలార్‌ ప్యానెల్స్‌ను, ప్రత్యేకంగా 30 కాన్ఫరెన్స్‌ హాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించే అవకాశం కూడా ఉన్నది. సచివాలయం ముందువైపు రెండు బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీస్‌, ఏటీఎమ్‌ సెంటర్లు, రైల్వే కౌంటర్‌, బస్‌పాస్‌ కౌంటర్‌, క్యాంటీన్‌లు ఉన్నాయి. వెనుకవైపు ఉద్యోగుల అసోసియేషన్‌, ఇండోర్‌ గేమ్స్‌, హౌసింగ్‌ సొసైటీ కార్యాలయాల కోసం నాలుగు అంతస్తులతో ఒక బిల్డింగ్‌ ను నిర్మించారు. సచివాలయంతో పాటు గుడి, మసీదు, చర్చిలను కూడా నిర్మించారు. వాటి పక్కనే ముందువైపు రిసెప్షన్‌ హాల్‌, ఎన్‌ఆర్‌ఐ సెంటర్‌, పబ్లిసిటీ సెల్‌ పక్కనే మీడియా కోసం గదులు నిర్మించారు. మంత్రులు మొదలుకుని అధికారులందరూ ఇక్కడే ఉండడంతో సమస్యలతో వచ్చే ప్రజలకు వెంటనే పరిష్కారం లభిస్తుంది.
సచివాలయ విస్తీర్ణం
మొత్తం భూ విస్తీర్ణం : 28 ఎకరాలు
భవనం నిర్మించిన ఏరియా : 2.45 ఎకరాలు
ల్యాండ్‌ స్కేపింగ్‌ : 7.72 ఎకరాలు
సెంట్రల్‌ కోర్ట్‌ యార్డ్‌ లాన్‌ : 2.2 ఎకరాలు
పార్కింగ్‌ : 560 కార్లు, 700 ల బైక్‌ లు,
యాన్సిలరీ బిల్డింగ్‌ ఏరియా : 67,982 చ.అ.
ప్రధాన భవన కాంప్లెక్స్‌ బిల్టప్‌ ఏరియా : 8,58,530 చ.అ.
లోయర్‌ గ్రౌండ్‌ + గ్రౌండ్‌ + ఆరు అంతస్తుల్లో ఒక్కోదాని ఎత్తు : 14 అడుగులు
అశోక చిహ్నం మొత్తం ఎత్తు : 265 అడుగులు
భవనం పొడవు, వెడల్పు : 600 X 300
ప్రధాన గుమ్మటాలు (స్కైలాంజ్‌) : 11వ అంతస్థు

సచివాలయంలో అంతస్తుల వారీగా శాఖల వివరాలు:
గ్రౌండ్‌ ఫ్లోర్‌ : ఎస్‌సి, మైనార్టీ, లేబర్‌, రెవెన్యూ శాఖలు
1వ అంతస్తు: ఎడ్యుకేషన్‌, పంచాయతీ రాజ్‌, హోంశాఖ
2వ అంతస్తు: ఫైనాన్స్‌, హెల్త్‌, ఎనర్జీ, పశు సంవర్థక శాఖ
3వ అంతస్తు: ఇండస్ట్రియల్‌ అండ్‌ కామర్స్‌ డిపార్ట్‌ మెంట్‌, ప్లానింగ్‌ డిపార్ట్‌ మెంట్‌
4వ అంతస్తు : ఫారెస్ట్‌, కల్చరల్‌ డిపార్ట్‌ మెంట్‌, నీటి పారుదల శాఖ, లా డిపార్ట్‌ మెంట్‌
5వ అంతస్తు: ఆర్‌ అండ్‌ బి, సాధారణ పరిపాలన శాఖలు
6వ అంతస్తు: సిఎం, సిఎస్‌, సిఎంఓ ఉన్నతాధికారులు, పిఆర్‌ఓ, సిబ్బంది కార్యాలయాలు
సచివాలయం పరిసరాల్లో పార్కుల మూసివేత
డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండిఎ) ప్రకటించింది. లుంబిని పార్క్‌, ఎన్‌టిఆర్‌ గార్డెన్‌, ఎన్‌టిఆర్‌ ఘాట్‌, లేజర్‌ షో లను మూసి వేస్తున్నట్లు వెల్లడించింది.

డబుల్‌ బెడ్‌రూమ్‌’ మార్గదర్శకాలపై కెటిఆర్‌ తొలి సంతకం
హైదరాబాద్‌ నగరంలో లక్ష మందికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ మార్గదర్శకాల దస్త్రాంపైన నూతన సచివాలయంలో మున్సిపల్‌ శాఖ మంత్రి కెటి.రామారావు తొలి సంతకం చేయనున్నారు. సచివాలయంలోని మూడవ అంతస్తులోని తన కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్‌ ఇక నుంచి తన విధులను నిర్వర్తించనున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments