HomeNewsLatest Newsడాక్టర్ల రక్షణకు చట్టం రూపొందించండి

డాక్టర్ల రక్షణకు చట్టం రూపొందించండి

కేంద్రానికి సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం డిమాండ్‌
న్యూఢిల్లీ : మహిళా డాక్టర్లు పనిచేసే ప్రదేశంలో వారిపై జరుగుతోన్న హింసను ముందస్తుగా నిరోధించేందుకు అవసరమైన గట్టి భద్రతాచర్యలను నిర్థారించే ఒక కేంద్ర చట్టాన్ని వెంటనే రూపొందించాలని భారత కమ్యూనిష్టు పార్టీ (సిపిఐ) జాతీయ కార్యదర్శివర్గం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు మంగళవారం సిపిఐ పార్టీ కార్యాలయం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేసింది. కోల్‌కతా ఆర్‌జి కార్‌ మెడికల్‌ కాలేజి, హాస్పిటల్‌లో ఇటీవల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యాచార ఘటన అత్యంత భయానకమైనదని, దేశంలోని యావత్‌ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని సిపిఐ జాతీయ కార్యదర్శివర్గం ఈ ఘటనపై విచారం వ్యక్తంచేసింది. నాగరిక సమాజంలో హింసకు ఏ మాత్రం స్థానం లేదని, ఇలాంటి చర్యలను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌ హత్యాచార ఘటన దేశంలో మహిళల గౌరవానికి, భద్రతకు గట్టి ముప్పు పొంచిఉన్నదని, వారు పనిచేసే ప్రదేశాలలో వారికి ఏ మాత్రం రక్షణ లేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నదని పార్టీ ఆవేదన వ్యక్తంచేసింది. మహిళలకు తప్పనిసరిగా భద్రత కల్పించాలని సంబంధిత సంఘాలు, అధికారులు గట్టిగా చెబుతున్నా దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం డాక్టర్లపై జరుగుతోన్న హింసను అరికట్టేందుకు చట్టాలను ఇప్పటి వరకూ రూపొందించకపోవడాన్ని ఆక్షేపించింది. విచారణ సంస్థలు కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటనపై గట్టిచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అయితే ఈ ఒక్క కేసులో మాత్రమే కాకుండా మహిళలపై జరుగుతున్న అన్ని హింసాత్మక ఘటనలకు సంబంధించిన విషయాలలో కూడా కఠినచర్యలు తీసుకోవాలని కోరింది. మహిళలపై జరుగుతోన్న దారుణ ఘటనలకు పాల్పడిన నేరస్థులను కఠినంగా శిక్షించేందుకు విచారణ వేగవంతంగా చేసి న్యాయం త్వరగా జరిగేలా విచారణ సంస్థలు కృషిచేయాలని సూచించింది. మహిళల రక్షణ చర్యలపై మరింత అవగాహన పెంపొందించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన గట్టి జాగ్రత్తచర్యలు చేపట్టాలని సిపిఐ ఆకాంక్షించింది. డాక్టర్లపై హింసను ముందస్తుగా నివారించే చట్టాలను కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే రూపొందించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల డిమాండ్‌ను పట్టించుకోవడంలో కానీ, చర్యలుచేపట్టడంలో కానీ స్పందించడం లేదని సిపిఐ ఆరోపించింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments