డయాలసిస్‌ లేక ఇబ్బందులు

కిడ్ని వ్యాధి గ్రస్తులు అవస్థలు
రవాణా లేకపోవడంతో ఆసుపత్రులకు వెళ్లలేని పరిస్థితి
ఆటోలు, వ్యక్తిగత వాహనాల్లో రోగులను అనుమతించని పోలీసులు
అత్యవసర వైద్య సేవలకు అనుమతిస్తామన్న ప్రభుత్వం
ప్రభుత్వ అదేశాలను పట్టించుకోని పోలీసులు
ఆనారోగ్య సమస్యలతో రోగుల సతమతం
హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌రెడ్డిలు అత్యవసర వైద్య సేవలకు సంబంధించిన వారిని అనుమతిస్తామని ప్రకటించినా క్షేత్ర స్థాయిలో మాత్రం అమలుకు నోచుకొని పరిస్థితులు నెలకొన్నాయి. దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు కరోనా వైరస్‌ ప్రాణసంకటంగా మారింది. హైదరాబాద్‌ మహానగరంలో ఆదివారం జనతా కర్ఫ్యూతో సోమవారం నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి తీసుకొచ్చారు. దీంతో నగరంలో దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు రోజు వారి వైద్య సేవలకు దూరం అయ్యారు. ప్రధానంగా కిడ్ని వ్యాధులు ఉన్న వారు రోజు తప్పి రోజు డయాలసిస్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆసుపత్రులకు వెళ్లి డయాలసిస్‌ చేసుకోవాలంటే సుమారు 4 గంటల సమయం పడుతుంది. హైదరాబాద్‌ మహానగరంలో కిడ్ని వ్యాధి గ్రస్తులు సుమారు 18 వేల వరకు ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెప్పుతున్నాయి. ఇందులో ఆరోగ్యశ్రీ ద్వారా 10వేల మంది చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సలు పొందుతున్న వారంతా పేదవారే. ఆరోగ్యశ్రీ ద్వారా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్యశ్రీ చికిత్సలు అందించే ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించడంతో డయాలసిస్‌ చేసుకునే పరిస్థితుల్లో లేకుండా పోయింది. ఆటోలు, వ్యక్తిగత వాహనాలను పోలీసులు అనుమతించకపోవడంతో వైద్య సేవలు అందరని పరిస్థితులు నెలకొన్నాయి. బాలానగర్‌లో ఉండే మహిళా తమ తల్లిని అమీర్‌పేట్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి ఆటోలో తీసుకపోతుంటే అనేక చోట్ల పోలీసులు అడ్డగించారని వాపోయారు. తాము ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రులకు వెళ్తుతున్నామని చెప్పేందుకు కూడా పోలీసులు అవకాశం ఇవ్వాలేదని సదరు మహిళా విలపించారు. కిడ్ని వ్యాధితో బాధ పడుతున్న తన తండ్రికి డయాలసిస్‌ చేయించేందుకు తల్లితండ్రిని ఆసుపత్రి దగ్గర దింపి తిరిగి ఇంటికి వస్తున్న మరో యువకుడిని పోలీసులు దాడి చేశారని తెలిపారు. తన భర్తకు డయాలసిస్‌ చేపించేందుకు ఆటోలో ఆసుపత్రికి మహిళ తీసుకవెళ్లింది. ఆసుపత్రి బయట వారి కోసం వేచిచూస్తున్న ఆటోడ్రైవర్‌ను పోలీసులు కొట్టడంతో అక్కడి నుంచి ఆటోతో డ్రైవర్‌ వెళ్లిపోయాడు. దీంతో వారు రోజాంతా ఆసుపత్రి దగ్గర పడిగాపులు పడాల్సి వచ్చింది. ప్రజా రవాణా లేకపోవడంతో వ్యక్తిగత వాహనాలు, లేదా ఆటోల ద్వారా ఆసుపత్రులకు వెళ్లేందుకు అనుమతించడం లేదు. వైద్య చికిత్సలకు సంబంధించిన పత్రాలు చూపిస్తే ఆటోలు, వ్యక్తిగత వాహనాలను అనుమతించాలని డయాలసిస్‌ రోగుల బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకుంటే ఆరోగ్య సమస్యలు తీవ్రమై ప్రాణాల మిదకు వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హెచ్‌.ఐ.వి రోగులకు అందని మందులు…
హెచ్‌.ఐ.వి రోగులు ఎఆర్‌టి మందులు క్రమం తప్పకుండా వాడాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ మహానగరంతో పాటు శివారు జిల్లాలకు చెందిన రోగులు నగరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మందులు తీసుకపోతుంటారు. నగరంలోని గాంధీ, కింగ్‌కోఠి, నిలోఫర్‌, ఎర్రగడ్డ చేస్ట్‌ ఆసుపత్రులలో హెచ్‌.ఐ.వి రోగులకు ఎఆర్‌టి మందులు ఉచింతంగా అందచేస్తారు. సాధారణంగా రోజుకు సుమారు 1500 నుంచి 2వేల మంది వరకు రోగులు ఈ ఆసుపత్రుల నుంచి మందులు తీసుకపోతారు. ఆదివారం నుంచి కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్‌ రవాణా వ్యవస్థలు పూర్తిగా బంద్‌ చేశారు. ఈ క్రమంలో పేదలైన హెచ్‌.ఐ.వి రోగులు మందులు తీసుకపోలేని పరిస్థితులు నెలకొన్నాయి. మందులు వేసుకోవడం మానేస్తే వ్యాధి తిరగబడటంతో పాటు రోగ నిరోధ శక్తి తగ్గిపోయి రోగులు మృతి చెందే పరిస్థితులు ఉంటాయని వైద్యులు చెప్పుతున్నారు. ఈ క్రమంలో హెచ్‌.ఐ.వి రోగులకు మందులు అందే విధంగా ప్రభుత్వం ఏదైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చర్యలు తీసుకోవాలని రోగులు కొరుతున్నారు. మందులు ఇవ్వడం అపేస్తే రోగుల ఆరోగ్య పరిస్థితులు దాయానీయంగా మారుతాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
ఒపి బంద్‌తో ఆవస్థలు…
కరోనా నైపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఒ.పి సేవలను ప్రభుత్వం నిలిపేసింది. నగరంలో సాధారణంగా జర్వం, ఇతర వైద్య సేవల కోసం వెళ్లిన వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సాధారణ వైద్య సేవలు అందకపోవడంతో చిన్న పిల్లలు, వృద్దులు ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని నగర వాసులు కొరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?