న్యూఢిల్లీ/చండీగఢ్ : రైతు ప్రయోజనాలను దెబ్బతీసేవిగా ఉన్న మూడు కొత్త చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఈనెల 26న దేశ రాజధానిలో వివిధ కర్షక సంఘాలు తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీకి ఢిల్లీ పోలీస్ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సుమారు రెండు మాసాలుగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతుల సంఘాలకు ఇది తొలి విజయంగా పేర్కోవాలి. గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాతే ర్యాలీ ఉంటుందని రైతు సంఘాల నేతలు స్పష్టం చేసినప్పటికీ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమవుతుందన్న అనుమానంతో పోలీస్‌లు అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. రాజ్యాంగ బద్ధంగా తమకు లభించిన హక్కులను అధికారులు కాలరాస్తున్నారని ఆరోపించిన రైతు సంఘాలు సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించాయి. దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రం గా స్పందిస్తూ, ఇది పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన అంశమేనని స్పష్టం చేసింది. ఎవరి అధికారాలు ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదని అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయాధికారం ఢిల్లీ పోలీస్లదేనని తేల్చిచెప్పింది. దీనితో రైతు సంఘాల నేతలు మళ్లీ ఢిల్లీ పోలీస్ అధికారులను కలిసి అనుమతిని మంజూరు చేయాల్సిందిగా కోరుతూనే ఉన్నారు. నిన్న టి వరకూ అనుమతినిచ్చేది లేదంటూ భీష్మించుకున్న అధికారులు శనివారం అనుమతినిచ్చారు. దీనిని రైతుల విజయంగా పేర్కోవాలని భారతీ కిసాన్ యూనియన్ (బికెయు) ఏక్తా-ఉగ్రాహన్ ప్రధాన కార్యదర్శి సుఖ్‌దేవ్ సింగ్ కొక్రికలాన్ వ్యాఖ్యానించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి సుమారు 30,000 ట్రాక్టర్లు వస్తాయన్నారు. ఇతర ప్రాంతాలను కూడా కలిపితే, ర్యాలీలో పాల్గొనే ట్రాక్టర్ల సంఖ్య మరింత పెరుగుతుంద న్నారు. మూడు చట్టాలను కేంద్రం ఉపసంహరించుకునే వరకూ రైతుల పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఇలావుంటే, ట్రాక్టర్ ర్యాలీకి అనుమతి లభించడంపై పలువురు రైతు సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. తమ ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ర్యాలీ ఉపయోగపడుతుందని వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఆ మూడు చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించాల్సిందేనని వారు స్పష్టం చేశారు.
నాయకులను విమర్శించొంద్దు
గణతంత్ర దినోత్సవం నాడు హర్యానాలో జాతీయ జెండా ఎగరవేసే మంత్రులను, రాజకీయ నాయకులను విమర్శించ వద్దని హర్యానా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చడూనీ శనివారం రైతులకు విజ్ఞప్తిచేశాడు. అయితే మిగిలిన రోజుల్లో ర్యాలీలు, ఇతర సంఘటనల్లో రాష్ట్ర మంత్రుల్ని విమర్శించడం కొనసాగించవచ్చని సూచించాడు. ఇక గణతంత్ర వేడుకలకు ఎలాంటి విఘాతం కలిగినా “తప్పుడు సందేశం ఇచ్చినట్లు అవుతుంద”ని ఆయన అన్నారు. ఈనెల మొదట్లో వ్యవసాయ చట్టాల ప్రయోజనాలను ప్రజలకు వివరించేందుకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రసంగించబోయే “కిసాన్ మహా పంచాయత్” వేదికను నిరసనకారులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. గత నెల అంబాలా నుంచి ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న సందర్భంలో రైతులు నల్లజెండాలు ప్రదర్శించారు. అదే నెలలో మరో సంఘటనలో కేంద్ర మంత్రి రత్తన్ లాల్ కటారియాకు అంబాలా పరిసరాల్లోని జండ్లి గ్రామంలో రైతులు నల్లజెండాలతో స్వాగతం పలికారు. ఇక ఈనెల 26న రాష్ట్రవ్యాప్తంగా జరిగే వివిధ వేడుకల్లో ఖట్టర్, ఇతర రాష్ట్ర మంత్రులు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు సమాచారం. ఒక అధికారిక ప్రకటన ప్రకారం ఖట్టర్ పానిపట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా అంబాలాలో ఒక వేడుకలో జెండా ఎగరవేస్తారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు హాజరయ్యే ప్రదేశాల్లో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు హర్యానా పోలీసులు వెల్లడించారు.
రైతు నాయకులను చంపేందుకు కుట్ర
నిరసన చేస్తున్న రైతులు తమ నాయకులు నలుగురిని చంపేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణ చేశారు. ఈ నెల 26న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ పెరేడ్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలతో హర్యానా పోలీసులు ఒకరిని ప్రశ్నించారు. అతణ్ని రైతు సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి పోలీసులకు అప్పగించారు. సుమారు 21 ఏళ్లు ఉండే ఆ యువకుణ్ని సోనిపత్ నేర విభాగంలో ప్రశ్నించినట్లు తెలిసింది. సోనిపత్‌లో నివసించే ఆ యువకుడిపై ఇంతకుముందు ఎలాంటి నేరారోపణలు లేవు. అతని దగ్గర ఎలాంటి ఆయుధాలు, మందుగుండు లేవు. ఇక కుట్ర గురించి కూడా ఎలాంటి వివరాలను అతడి నుంచి రాబట్టలేకపోయాం, అయితే విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. సింఘు దగ్గర విలేకర్ల సమావేశం తర్వాత శుక్రవారం రాత్రి రైతు నాయకులు ఆ యువకుణ్ని మీడియా ముందుంచారు. ఈ నెల 26న తనను, తన సహచరులను పోలీసుల వేషంలో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొనేవారిపై లాఠీ ఛార్జీ చేయమని అడిగినట్లుగా ఆ యువకుడు వెల్లడించాడు. సింగు దగ్గర పట్టుబడిన యువకుడిని హర్యానా పోలీసులకు అప్పగించినట్లు రైతు నాయకులు పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనను భగ్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతు నాయకుడు కుల్వంత్ సింగ్ సంధు ఆరోపించారు. ప్రముఖ రైతు నాయకులు నలుగురిని కాల్చేందుకు పథకం పన్నారని ముఖానికి తొడుగు ఉన్న ఆ యువకుడు విలేకర్ల సమావేశంలో పేర్కొన్నాడు. 26న ట్రాక్టర్ ర్యాలీలో ఢిల్లీ పోలీసులపై కాల్పులు జరిపి గందరగోళం సృష్టించేదుకు ప్రణాళిక ఉందని, దాంతో వారు నిరసన చేస్తున్న రైతులపై ఎదురు కాల్పులు జరిపేలా చేస్తుందని అతను వెల్లడించాడు. అయితే ఆ యువకుడు తాను రైతులు రాసిచ్చిన స్క్రిప్టును చెప్పినట్లు ప్రకటించినట్లు వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విడుదలైంది. ఇది అసలుదా కాదా అన్నది తేల్చాల్సి ఉంది.
ట్రాక్టర్ ర్యాలీకి గ్రీన్ సిగ్నల్
RELATED ARTICLES