కశ్మీర్‌లో మోడీ ఎన్నికల ఫార్సు

కల్లోలిత జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వ పునాదిస్థాయి ప్రజాస్వామ్య పునరుద్ధరణ బూటకం పరిపూర్తి అయింది. గత జులైలో పిడిపి ప్రభుత్వంనుంచి వైదొలిగి, రాష్ట్రపతిపాలన విధించిన బిజెపి తన ఆదేశాలను శిరసావహించే వ్యక్తిని గవర్నర్‌గా నియమించింది. స్థానిక సంస్థల (మున్సిపల్‌, పంచాయతీ) ఎన్నికలు జరపబోతున్నట్లు మోడీ ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించి అదేదో ఘనకార్యంగా దేశవ్యాప్త ప్రచారమిచ్చారు. ప్రధాన రాజకీయపక్షాలైన పిడిపి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎన్నికలను బహిష్కరించిన దరిమిలా ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా దశలవారీ పోలింగ్‌ నిర్వహించారు. వాటి ఫలితాలు శనివారం ప్రకటించారు. జమ్మూ, లడాఖ్‌లలో ఒక మోస్తరు (17లక్షల ఓటర్లలో 35 శాతం) ఓటింగ్‌ జరగ్గా, కశ్మీర్‌ లోయలో అది సగటున 4శాతం మాత్రమే. భద్రతా కారణాల రీత్యా అభ్యర్థుల పేర్లను గోప్యంగా ఉంచారు. ఫలితాల ప్రకటనతో పేర్లు వెల్లడించారు. లోయలో ముఖ్యంగా టెర్రరిజం తీవ్రంగా ఉన్న దక్షిణ కశ్మీర్‌ జిల్లాల్లో బిజెపికి చాలా సీట్లు వచ్చాయి. అభ్యర్థులను భద్రతాదళాల రక్షణలో బయటనుంచి తెచ్చారు. పోలింగ్‌ అవసరం లేని అనేక స్థానాలు వారు గెలిచారు. మున్సిపల్‌ కౌన్సిళ్లలో కూర్చోవటానికి వారు మళ్లీ వస్తారా అన్నది అనుమానమే. కశ్మీర్‌లో ప్రశాంతత నెలకొంటుందని మిగతాదేశంలో భ్రమలు వ్యాప్తి చేయటానికి మోడీ ప్రభుత్వం ఈ బూటకపు ఎన్నికలు నిర్వహించింది. గుర్రాన్ని బండికి వెనుక కట్టడం అంటే ఇదే!

DO YOU LIKE THIS ARTICLE?