టూల్‌కిట్ కేసులో… దిశా రవికి బెయిల్
న్యూఢిల్లీ: టూల్‌కిట్ కేసులో పర్యావరణ ఉద్యమకారిణి దిశా రవికి మంగళవారం బెయిల్ లభించింది. దీనికోసం ఆమె లక్ష రూపాయల విలువ కలిగిన రెండు సెక్యూరిటీలను జామీనుగా ఉంచారు. ఇక సామాజిక మాధ్యమం వేదికగా టూల్‌కిట్‌ను పంచుకున్నారని దిశా రవితోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న శంతను ములుక్ కూడా మంగళవారం ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీలోని ఓ న్యాయస్థానాన్ని సంప్రదించారు. ఇది బుధవారం విచారణకు రానుంది. కాగా, బొంబాయి హైకోర్టు ములుక్‌కు ఈ నెల 16 నుంచి పది రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. విద్రోహం,ఇతర నేరారోపణలపై దిశా రవి, నికితా జాకబ్‌తోపాటు శంతను ములుక్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా సామాజిక మాధ్యమంలో పంచుకున్న ‘టూల్‌కిట్ గూగుల్ డాక్’ కేసు విచారణలో భాగంగా పర్యావరణ కార్యకర్త దిశా రవిని మంగళవారం ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ కార్యాలయంలో విచారణ చేశారు. దిశను ఢిల్లీలోని ఓ న్యాయస్థానం ఒక్కరోజు పోలీస్ కస్టడీకి పంపించిన విషయం తెలిసిందే. కాగా, నికితా జాకబ్, శంతను ములుక్తోపాటు దిశా రవిపై న్యాయస్థానంలో విచారణ సాగుతోంది. విచారణలో భాగంగా జాకబ్, ములుక్ను ఢిల్లీ పోలీస్ సైబర్ సెల్ కార్యాలయంలో ప్రశ్నించారు. పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ పోస్ట్ చేసిన ‘టూల్‌కిట్ గూగుల్ డాక్’పై విచారణలో భాగంగా బెంగళూరుకు చెందిన ఉద్యమకారిణి దిశా రవిని ఢిల్లీ పోలీస్‌లు అరెస్ట్ చేశారు. మంగళవారంతో ఆమె పోలీస్ కస్టడీ ముగిసింది. కాగా, నికితా జాకబ్, శంతను ములుక్ న్యాయస్థానం నుంచి మధ్యంతర బెయిల్ పొందారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనల ముసుగులో భారత్‌లో అశాంతి, హింసను సృష్టించేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రలో భాగమే టూల్‌కిట్ అని పోలీస్‌లు ఆరోపించారు.