రాష్ట్రంలో 16 నుంచి పంపిణీ
ప్రజాపక్షం / హైదరాబాద్ సామాన్యుల నుంచి విఐపిల వరకు అందరి వెన్నులో వణుకు పుట్టించిన కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యా క్సిన్ రాష్ట్రానికి చేరింది. దీంతో పంపిణీకి రంగం సిద్ధమైంది. సీరం సంస్థ రూపొందించిన ‘కొవిషీల్డ్’, భారత్ బయోటెక్ రూపొందించిన ‘కోవాగ్జిన్’ సమర్థమైన కొవిడ్ వ్యాక్సిన్లుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. తొలి విడతలో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడానికి ఏర్పా ట్లు జరుగుతున్నాయి. పంపిణీ ప్రక్రియ కూడా మొదలైంది. ఇప్పటికే పుణె నుంచి వ్యాక్సిన్లతో ట్రక్కులు బయల్దేరాయి. ఆ తర్వాత ప్రత్యేక విమానాల్లో సిబ్బంది గమ్యస్థానాలకు చేర్చనున్నారు. ఇక రాష్ట్రానికి చేరిన వ్యాక్సిన్‌ను జెడ్ కేటగిరీ భద్రతతో స్టోరేజీకి చేర్చారు. ఇప్పటికే ఏర్పాట్లపై సిఎం కెసిఆర్ సమీక్ష నిర్వహించారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరికైనా రియాక్షన్ ఉంటే అవసరమైన వైద్య చికిత్స అందించడానికి కూడా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ముందుగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సహా వైద్య, ఆరోగ్య సిబ్బందికి ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. అనంతరం 50 ఏళ్లు పైబడిన వారికి, ఆ తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా మంగళవారం రాష్ట్రానికి 6.5 లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ వచ్చాయి. 1,213 సెంటర్లలో వ్యాక్సినేషన్ చేయనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. పుణె నుంచి 9 ప్రత్యేక విమానాల ద్వారా ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, గౌహతి, షిల్లాంగ్, అహ్మదాబాద్, విజయవాడ, భువనేశ్వర్, పాట్నా, బెంగళూరు, లక్నో, ఛండీగడ్‌కు మొత్తంగా 56.5 లక్షల డోసుల వ్యాక్సిన్ రవాణా జరిగింది.
టీకా వచ్చేసింది
RELATED ARTICLES