టిక్రి సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య

చండీగఢ్‌: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలు మరో రైతు ప్రాణాలను బలి తీసుకున్నాయి. టిక్రి సరిహద్దులో రాజ్‌బీర్‌ సింగ్‌ అనే రైతు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఈ నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర చట్టాలే కారణమని అతను తన సూసైడ్‌ నోట్‌లో స్పష్టం చేశాడు. ఇటీవలే హర్యానాలోని జింద్‌లో ఒక రైతు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ప్రాణాలు తీసుకున్న సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తర్వాత కొన్ని రోజులకే టిక్రి సరిహద్దు వద్ద ఓ రైతు విషం తాగి ప్రాణాలు తీసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌ మాసంలో పంజాబ్‌కు చెందిన ఓ లాయర్‌ ఇదే టిక్రి సరిహద్దుకు అత్యంత సమీపంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి చలించిపోయానని, అందుకు ఇలాంటి కఠిన నిర్ణయాన్ని తీసుకుంటున్నానని అతను తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. సింఘు సరిహద్దు వద్ద సిక్కు ఆధ్యాత్మిక బోధకుడు సంత్‌ రామ్‌ సింగ్‌ బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌లో వివరించాడు. తాజాగా సిస్సార్‌ జిల్లాకు చెందిన రాజ్‌బిర్‌ టిక్రిలోని ఆందోళన కేంద్రానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారాన్ని అందుకొని సంఘటన స్థలానికి వెళ్లామని, అప్పటికీ అతను మృతిచెందాడని బహదూర్‌గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. ధైర్యంగా ఉండాలని, పోరాడి సమస్యలను సాధించుకోవాలని రైతు సంఘాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, కొంత మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తున్నది. రైతుల బలిదానాలతోనైనా కేంద్ర సర్కారులో మార్పురావాలని, చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. మూడు సాగు చట్టాలు, ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ (ప్రమోషన్‌ అండ్‌ ఫెసిలిటేషన్‌) యాక్ట్‌ 2020, ఫార్మర్స్‌ (ఎంపవర్‌మెంట్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అగ్రిమెంట్‌ ఆన్‌ ప్రైసెస్‌ అస్యూరెన్స్‌ అండ్‌ ఫార్మ్‌ సర్వీసెస్‌ యాక్ట్‌ 2020, ఎసెన్షియల్‌ కమ్మోడిటిస్‌ (అమెండ్‌మెంట్‌) యాక్ట్‌ 2020లను రద్దు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని చట్టబద్ధం చేయాలని కూడా రైతులు కోరుతున్నారు. అయితే, సాగు చట్టాల రద్దుకు ససేమిరా అంటున్న కేంద్రం, ఎంఎస్‌పికి ప్రత్యేక చట్టం అవసరం లేదని వాదిస్తున్నది. రైతుల ప్రధాన డిమాండ్లను పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ, ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నది.

DO YOU LIKE THIS ARTICLE?