టిఆర్‌ఎస్‌ సర్కార్‌కు చెంపదెబ్బ

ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చొద్దు

అసెంబ్లీ నిర్మించాలన్న మంత్రివర్గ నిర్ణయం కొట్టివేత
హైకోర్టు సంచలన తీర్పు
పిటిషనర్ల వాదనను సమర్థించిన ఉన్నత న్యాయస్థానం

ప్రజాపక్షం/హైదరాబాద్‌ లీగల్‌: ఎర్రమంజిల్‌ భవనం విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎర్రమంజిల్‌లోని చారిత్రక భవనాన్ని కూల్చి అసెంబ్లీ సముదాయాల్ని నిర్మించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ సోమవారం హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ఈ మేరకు సాయంత్రం 4 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది. 1870లో ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌ను నిర్మించిన నవాల్‌ సఫ్జదార్‌ జంగ్‌ ముషిర్‌దౌలా ఫర్క్‌ల్లా ముల్క్‌ వారసుడు డాక్టర్‌ మిర్‌ ఆస్గార్‌ హుస్సేన్‌, హెరిటేజ్‌ భవనాన్ని కూల్చరాదని డెక్కన్‌ ఆర్కియాలజికల్‌ అండ్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధి కె.జితేంద్రబాబు వేరువేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతిస్తూ తీర్పు చెప్పింది. ఇతరులు దాఖలు చేసిన పిల్స్‌ను పాక్షికంగా అనుమతిస్తూ కీలక తీర్పునిచ్చింది. ‘క్యాబినెట్‌ గత జూన్‌ 18న తీసుకున్న నిర్ణయం చెల్లదు. వారసత్వ భవనాల విషయంలో మార్పులు చేర్పులు చేయాలం టే జోనల్‌ రెగ్యులేషన్‌ 13(2) ప్రకారం కచ్చితంగా అమలు చేయాలి. అయితే ఎలాంటి అనుమతి పొందకుండానే క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడం చెల్లదు. విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్షకు ఆస్కారం తక్కువగా ఉన్నప్పటికీ చట్టాలకు లోబడి నిర్ణయం లేదు. అందుకే జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ప్రత్యక్షంగా చేయలేని దాని కోసం దొడ్డిదారిలో చేసే ప్రయత్నం కనబడింది. 2015లో హైకోర్టులో దాఖలైన ఒక పిల్‌లో 2016 ఏప్రిల్‌ 18న ధర్మాసనం ఇచ్చిన మార్గదర్శకాల్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. హెరిటేజ్‌ భవనాల మార్పులు, చేర్పులు చేయాలంటే రెగ్యులేషన్‌ 13 ప్రకారం చేయాలన్న నిబంధనను క్యాబినెట్‌ సైతం ధిక్కరించింది. ఏదైనా నగర గుర్తింపు, చరిత్ర, గతం గురించి చెప్పేది వారసత్వ భవనాలే. ఈ విషయాన్ని సర్కార్‌ పట్టించుకోలేదు’ అని తీర్పులో పేర్కొంది. ఎర్రమంజిల్‌లోని భవనం 150 సంవత్సరాల నాటిది. ఈ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాల సముదాయాన్ని నిర్మించాలని మంత్రివర్గం ఈ ఏడాది జూన్‌ 18న తీసుకున్న నిర్ణయం చెల్లదు. వారసత్వ, సాంస్కృతిక సంపద. హెచ్‌ఎండిఎ మాస్టర్‌ ప్లాన్‌ రూల్స్‌లో చేర్చాక వాటిని సవరించాలంటే చట్ట ప్రకారం చేయాలి. పాత చట్టం కింద ఒక నిబంధన ఒక నిబంధన చేరాక ఆ చట్టం రద్దయినా ఆ నిబంధన కొనసాగుతుంది. మాస్టర్‌ప్లాన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. రెగ్యులేషన్‌ 13ను మాస్టర్‌ ప్లాన్‌లో చేర్చారు. హెరిటేజ్‌ కన్సర్వేటివ్‌ కమిటీ ఒకసారి జాబితాలో మాస్టర్‌ ప్లాన్‌ చేర్చాక అందులోని వాటిని తొలగించాలన్నా, కొత్తగా చేర్చాలన్నా హెచ్‌ఎండిఎ చట్టంలోని సెక్షన్‌ 15 ప్రకారం చేయాలి

DO YOU LIKE THIS ARTICLE?