జ్వాల గుత్తా అకాడమీ ప్రారంభం

న్యూ ఢిల్లీ: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి జ్వాల గుత్తా క్రీడా అకాడమీని ఏర్పాటు చేశారు. ‘జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ పేరుతో ప్రారంభంచనున్నట్లు మంగళవారం జ్వాల గుత్తా ప్రకటించారు. అకాడమీకి సంబంధించిన లోగోను ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ, బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌, రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ ఆవిష్కరించారు. మొదటగా 14 బ్యాడ్మింటన్‌ కోర్టులతో అకాడమీని ప్రారంభించనున్నారు. అనంతరం మరికొన్ని క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి అకాడమీ ద్వారా శిక్షణ అందించనున్నారు. అకాడమీ ఏర్పాటు సందర్భంగా విజేందర్‌ సింగ్‌, సుశీల్‌ కుమార్‌ ప్రత్యేకంగా జ్వాల గుత్తాకు అభినందనలు తెలిపారు. ఎంతో ధైర్యంతో అకాడమీని ఏర్పాటు చేస్తున్న జ్వాల గుత్తాను కేంద్ర మాజీ మంత్రి అభినందించారు. లోగో ఆవిష్కరణ సందర్భంగా జ్వాల గుత్తా మాట్లాడుతూ… ’చాలా ఆనందంగా ఉంది. అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో హైదరాబాద్‌లోని మొయినాబాద్‌ సుజాత విద్యా సంస్థలో అకాడమీ ఏర్పాటు చేశా’ అని తెలిపారు. ’విశాలమైన మైదానంలో అత్యాధునిక సదుపాయాలతో అకాడమీ ఏర్పాటు అయింది. క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేలా శిక్షణ ఇస్తాం. మంచి నైపుణ్యం ఉన్న వాళ్లకు అకాడమీలో ప్రాధాన్యం ఉంటుంది. మంచి కోచ్‌లను ఏర్పాటు చేస్తాం. మొదటగా బాడ్మింటన్‌ కోర్టులతో అకాడమీని ప్రారంభిస్తాం. తర్వాత స్మిమ్మింగ్‌, క్రికెట్‌, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌ సహా పలు క్రీడల్లో శిక్షణ ఇస్తాం’ జ్వాల గుత్తా పేర్కొన్నారు. ’నా దృష్టిలో దిశకు సరైన న్యాయం జరగలేదు. ఎన్‌కౌంటర్లు, ఉరి శిక్షలు అత్యాచారాలను ఆపలేవు. సమాజంలో మార్పు తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యువతకు విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు కల్పించి సమాజంలో మార్పు తెచ్చినపుడే అత్యాచారాలు తగ్గుతాయని నేను భావిస్తున్నా’ అని జ్వాల గుత్తా అన్నారు. లోగో ఆవిష్కరణకు సంబందించిన వీడియోను జ్వాల గుత్తా తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. ’మేము ఇక్కడ ఉన్నాం’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది..

DO YOU LIKE THIS ARTICLE?