కార్యకర్తల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం
టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ
ప్రజాపక్షం/హైదరాబాద్ రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్. రమణ ప్రకటించారు. 150 డివిజన్లలో పోటీ చేస్తామని, ఇందుకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. టిడిపి హైదరాబాద్ సిటీ కార్యాలయంలో సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ నాయకులతో రమణ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొత్త్తుల వల్ల పార్టీ చాలా నష్టపోయిందని కార్యకర్తల అభిప్రాయం మేరకు ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రతి సోమవారం హైదరాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో తాను అందుబాటులో ఉంటానని హామీనిచ్చారు. పార్టీ కోసం పనిచేసే నాయకులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ లోక్‌సభ అధ్యక్షులు సాయిబాబా, నాయకులు బాలరాజ్‌గౌడ్, బిల్లర్ ప్రవీణ్, కొమురన్న, నల్లెల కిశోర్, రవీంద్రచారి, విజయశ్రీ, ఇందిర, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.