జిహెచ్‌ఎంసిలో లాక్‌డౌన్‌?

ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం
కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని సిఎం కెసిఆర్‌ నిర్ణయం
ప్రజాపక్షం / హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ (జిహెచ్‌ఎంసి) పరిధిలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్‌డౌన్‌ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం వెల్లడించారు. జిహెచ్‌ఎంసి పరిధిలో లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించుకుంటే అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందని, లాక్‌డౌన్‌ విధిస్తే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. నిత్యావసర సరుకులు కోనుగోళు చేసుకోవటానికి వీలుగా ఒకటి, రెండు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి రోజంతా ఖర్ఫ్యూ విధించాల్సి ఉంటుందన్నారు. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపాల్సి ఉంటుందని, ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందని, అన్ని విషయాలను లోతుగా పరిశీలించి అవసరమైన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని సిఎం కెసిఆర్‌ వివరించారు. ఎక్కువ పాజిటివ్‌ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, వైరస్‌ సోకిన వారికి అందుతున్న చికిత్స, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. వైద్యఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారకరామారావు, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమావేశంలో పరిస్థితిని వివరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. సమావేశంలో సిఎం కెసిఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద నగరమని, దేశ వ్యాప్తంగా అన్ని నగరాల్లో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న క్రమంలో హైదరాబాద్‌లోనూ అదే పరిస్థితి ఉండడం సహజమన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత ప్రజల కదలిక పెరిగిందని, దీంతో వైరస్‌ వ్యాప్తి జరుగుతున్నదన్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో వైరస్‌ వ్యాప్తిని నివారించడానికి మళ్లీ లాక్‌డౌన్‌ విధించారని, దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయని, హైదారాబాద్‌లో కూడా 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయని సిఎం వెల్లడించారు. అయితే లాక్‌డౌన్‌ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుందని, ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుందని, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని సిద్ధం చేయాలన్నారు. మంత్రివర్గాన్ని సమావేశ పరచాలని, అందరి అభిప్రాయాలు తీసుకుని లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని, అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో మంత్రివర్గాన్ని సమావేశ పరిచి, జిహెచ్‌ఎంసి పరిధిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్‌ చెప్పారు. సమావేశంలో తొలుత మంత్రి ఈటల మాట్లాడుతూ జిహెచ్‌ఎంసి పరిధిలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి మరోసారి 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలనేది వైద్యాధికారులు, వైద్య నిపుణులు కోరుతున్నారని చెప్పారు. “దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా జరుగుతున్నది. అదే క్రమంలో తెలంగాణలో కూడా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో మరణాల సంఖ్య కూడా తక్కువే. పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. పాజిటివ్‌గా తేలిన వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలలో కూడా వేలాది బెడ్లు సిద్ధం చేశాం. సీరియస్‌ పేషంట్లకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నాం. వ్యాధి లక్షణాలు లేని వారిని ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నాం” అని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి ప్రభుత్వానికి పంపిన తాజా నివేదికలో కూడా తెలంగాణలో వైరస్‌ వల్ల మృతి చెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించినట్లు సిఎంఓ వివరించింది. కొవిడ్‌ వల్ల మరణించిన వారి జాతీయ సగటు 3.04 ఉండగా, తెలంగాణలో అది కేవలం 1.52 మాత్రమేనని ఆమె వెల్లడించారు. తెలంగాణలో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నామని, పాజిటివ్‌ గా తేలిన వారికి తగు వైద్యం అందిస్తున్నామని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?