పారిశుద్ధ్య నిర్వహణ ఇక ప్రైవేట్‌కు
వెయ్యి కిలోమీటర్ల కమర్షియల్ రోడ్లను అప్పగించే యోచనలో సర్కార్
క్షేత్ర స్థాయి సర్వేలో యంత్రాంగం
ప్రజాపక్షం/హైదరాబాద్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) పౌర సేవలు ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ దిశ గా మారిపోతున్నాయి. సమగ్ర చెత్త నిర్వహణ ప్రాజెక్ట్ నుంచి మొదలైన ప్రైవేటీకరణ అంచలంచెలుగా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సిఆర్‌ఎంపి పేరిట నగరంలో 709 కిలోమీటర్ల రహదారులను ఐదేళ్లపాటు నిర్మా ణం, నిర్వహణ బాధ్యతలను బాడా సంస్థలకు కట్టబెట్టారు. ఇక ప్రస్తుతం కమర్షియల్ రోడ్లలలో పారిశుద్ధ్య నిర్వహణను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు సర్కార్ నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇటీవల పలు మార్లు కమిషనర్, అదనపు, జోనల్ కమిషనర్‌లతో సమావేశమైన మున్సిపల్ శాఖమంత్రి కె.టి.రామారావు ఈ విషయంపై కసరత్తు చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సర్కిళ్ల వారీగా అధికారులు కమిర్షియల్ రోడ్లను గుర్తించే పనిలో పడ్డారు. సిఆర్‌ఎంపి రోడ్లలలో 709 కిలోమీటర్లతో పాటు మరో 300 కిలోమీటర్ల కమర్షియల్ రోడ్లను గుర్తించనున్నారు. మొత్తం వెయ్యి కిలోమీటర్ల రోడ్లలలో పారిశుద్ధ్య నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి, వివరాలు సేకరిస్తున్నారు. జిహెచ్‌ఎంసిలో ప్రస్తుతం ఆరు జోన్‌లు, 30 సర్కిళ్లు ఉన్నాయి. సర్కిళ్ల వారీగా ఏజెన్సీలకు పారిశుద్ధ్య బాధ్యతలు అప్పగించనున్నారని తెలిసింది. సర్కిళ్ల వారీగా కమర్షియల్ రోడ్లు గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. ప్రైవేట్ ఏజెన్సీలు 24 గంటల పాటు పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. కమర్షియల్ ప్రాంతాల్లో రోజుకు మూడు, నాలుగు సార్లు రహదారులను ఊడ్చాల్సి ఉంటుంది. షాపులు, సూపర్ మార్కెట్లు, మాల్స్, హోటళ్లు, రెస్టారెంట్‌లు, మార్కెట్ల నుంచి నిత్యం మూడు సార్లు చెత్త సేకరించాల్సి ఉంటుంది. రోడ్లను ఊడ్చడంతో పాటు చెత్తను ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ల వరకు ప్రైవేట్ ఏజెన్సీలే తరలించాల్సి ఉంటుంది. కమర్షియల్ రోడ్లలో పూర్తి స్థాయిలో 24 గంటల పాటు ప్రైవేట్ ఏజెన్సీలే చెత్త తరలింపు పనులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలను అధికారులు రూపొందిస్తున్నారు. రోడ్ల సర్వేను జోనల్, డిప్యూటీ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారని సమాచారం.
అగమ్యగోచరంగా పారిశుద్ధ్య కార్మికుల పరిస్థితి…
జిహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 18,500 పైచిలుకు పారిశుద్ధ్య కార్మికులు, వారితో పనులు చేయించేందుకు వెయ్యిమందికి పైగా శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్(ఎస్‌ఎఫ్‌ఎ)లు పనిచేస్తున్నారు. వెయ్యి కిలోమీటర్ల పరిధిలో ప్రైవేట్ ఏజెన్సీలకు పారిశుద్ధ్య పనులు అప్పగిస్తే ప్రస్తుతం పనిచేస్తున్న వారి ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అనే విషయం ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. వారి ఉద్యోగాలను కొనసాగిస్తారా? లేక వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారా? అనే విషయంలో స్పష్టత లేకుండా పోయింది.
జిహెచ్‌ఎంసిలో ప్రైవేటీకరణ జోరు
RELATED ARTICLES