జిల్లాల్లో కరోనా కలకలం!

కరీంనగర్‌లో 86, నల్లగొండలో 41 కేసులు రంగారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో 212 పాజిటివ్‌లు
ఖమ్మం, కామారెడ్డిలోనూ భారీగా కేసులు 24 గంటల్లో 1,550 పాజిటివ్‌లు మరో 9 మంది బలి
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. సోమవారంనాడు ఒకేరోజు 1,550 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 9 మంది కరోనాకు బలయ్యారు. ఈ విధంగా మృతుల సంఖ్య 365కి పెరిగింది. జిహెచ్‌ఎంసిలో యథావిధిగా భారీగా కేసులు నమోదవుతుండగా, దానికి చుట్టూరా ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ సారి కూడా భారీగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 926 కేసులు నమోదుకాగా, రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 212, మేడ్చల్‌ జిల్లాలో 53 కేసులు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో కేసులు పెరిగాయి. ఈ జిల్లాలో కొత్తగా 19 కేసులు, మెదక్‌ జిల్లాలో 6, సిద్దిపేట జిల్లాలో 10, వికారాబాద్‌ జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఇవికాకుండా, కరీంనగర్‌ జిల్లాలో ఊహించని విధంగా కరోనా కేసులునమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరీంనగర్‌ జిల్లాలో ఒకేసారి 86 కేసులు బయటపడ్డాయి. అలాగే నల్లగొండ జిల్లాలో 41 కేసులు నమోదయ్యాయి. ఖమ్మం, కామారెడ్డి జిల్లాలూ ఇదే స్థాయిలో భయపెడుతున్నాయి. ఖమ్మంలో ఏకంగా 38, కామారెడ్డిలో 33 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మహబూబ్‌బాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో 13 కేసులు చొప్పున నమోదయ్యాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 16 కేసులు, సూర్యాపేట, బద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో పదేసి కేసులు నమోదయ్యాయి. వరంగల్‌ రూరల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో 8 కేసులు చొప్పున, రాజన్న సిరిసిల్లలో 7 కేసులు, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఆరేసి కేసులు, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఐదేసి కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రెండు కేసులు, వనపర్తి, ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. వలసలు, ప్రవాసులకు సంబంధించి తాజాగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 36,221కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్‌ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్‌ సోకిన వారిలో ఇంకా 12,178 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 23,679 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. సోమవారంనాడు ఒకేరోజు 1,197 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 11,525 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, అందులో 9,975 శాంపిల్స్‌ నెగిటివ్‌గా నిర్ధారించారు. ఇప్పటివరకు మొత్తం 1,81,849 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఇదివరకు ప్రకటించినట్లుగానే బెడ్‌లు చాలా వరకు ఖాళీగా వున్నాయని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని తెలిపింది. ఇప్పటివరకు 10.8% బెడ్‌ మాత్రమే ఆక్యుపై అయ్యాయని, ఇంకా 89.2% బెడ్‌లు ఖాళీగా వున్నాయని పేర్కొంది. 11,928 ఐసోలేషన్‌ బెడ్‌లు, 3,537 ఆక్సిజన్‌ బెడ్‌లు, 1,616 ఐసియు బెడ్‌లు మొత్తంగా 17,081 బెడ్‌లు అందుబాటులో వున్నాయని, వాటిలో ఇంకా 15,237 బెడ్‌లు ఖాళీగా వున్నాయని వివరించింది.

DO YOU LIKE THIS ARTICLE?