ఖండించిన సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ
నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్
ప్రజాపక్షం /హైదరాబాద్ జిల్లాల్లో కూడా ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం పూనుకోవడాన్ని సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే రాష్ర్టవ్యాప్తంగా భూముల ధరలు అడ్డగోలుగా పెరిగి నిరుపేద, పేద, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేకుండా పోయాయని అన్నారు. ఈ మేరకు శనివారం ఒక పత్రికా ప్రకటనను ఆయన విడుదల చేశారు. రాష్ర్ట ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వ భూములను వేలం వేయడం అన్యాయమని చాడ విమర్శించారు. మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల ఏర్పాటుకు భూములు లేకపోవడం ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. రాష్ర్ట వ్యాప్తంగా భూముల మార్కెట్ ధరలు రెండు సార్లు పెంచి ప్రజలపై భారం మోపిందని, సామాన్య ప్రజలు, రైతులు భూములు కొనే స్థితిలో లేరన్నారు. ప్రభుత్వం పోడు భూముల సమస్యను పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తోందని చాడ దుయ్యబట్టారు. వెంటనే ప్రభుత్వ భూముల వేలం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, పోడు రైతులకు సాగు పట్టాలు ఇవ్వాలని చాడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
భూములను వేలం వేస్తే అడ్డుకుంటాంః కోదండరెడ్డి
ప్రభుత్వం భూములు అమ్మడం బాధ్యతా రాహిత్యమని ఎఐసిసి కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని విమర్శించారు. ధనికులకు దోచిపెట్టేందుకు కెసిఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. భూముల అమ్మకం వేలాన్ని వెంటనే ఆపాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన అడ్డుకుంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఎకరం భూమి కూడా అమ్మలేదని చెప్పారు.
జిల్లాల్లోనూ ప్రభుత్వ భూముల వేలమా!
RELATED ARTICLES