జిడిపిని తగ్గించిన‌ ఫిచ్‌

న్యూఢిల్లీ: కోరుకున్న రీతిలో ఆర్థిక వేగం లేకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్‌ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వృద్ధిరేటును ఇదివరలో అంచనా వేసిన 7 శాతం నుంచి 6.8 శాతానికి ఫిచ్‌ రేటింగ్స్‌ సంస్థ శుక్రవారం తగ్గించేసింది. అంతేకాక మార్చి 2019తో ముగియనున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధిరేటును కూడా అనుకున్న 7.2 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గించేసింది. ఇది 7 శాతం కన్నా తక్కువ అని కేంద్రీయ గణాంకాల కార్యాలయం(సిఎస్‌ఓ) తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంది. భారత్‌ జిడిపి వృద్ధి రేటు వరుసగా రెండో త్రైమాసికంలో(అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌) కూడా తగ్గిపోయిందని ఫిచ్‌ పేర్కొంది. జూలై-సెప్టెంబర్‌లో 7 శాతం, ఏప్రిల్‌-జూన్‌లో 8 శాతం ఉన్న వృద్ధి రేటు అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో 6.6 శాతానికి పడిపోయింది. ఉత్పత్తి రంగం, వ్యవసాయ రంగం మందకొడిగా సాగుతుండడంతో ఆర్థిక వృద్ధి వేగం తగ్గిపోయింది. ఈ కారణంగానే ఫిచ్‌ భారత్‌ వృద్ధి రేటింగ్స్‌ను తగ్గించింది. బ్యాంకేతర ఆర్థిక కంపెనీలు(ఎన్‌బిఎఫ్‌సి)ల నుంచి లభించే పరపతిని టైట్‌ చేసేశారు. దాంతో ఆటోలు, టూవీలర్‌ వాహనాల అమ్మకాలు తగ్గిపోయాయి. కాగా ఆహార ద్రవ్యోల్బణం గత ఏడాది చివరన నెగటివ్‌ పరిధిలోకి చేరింది. రైతుల ఆదాయం పడిపోయింది. ఫిచ్‌ సంస్థ అంచనా ప్రకారం 2019 డిసెంబర్‌ నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72కు చేరుకుంటుంది. 2020 డిసెంబర్‌ నాటికి రూ. 73కు చేరుకుంటుంది. 2018 డిసెంబర్‌లో రూపాయి విలువ డాలరుకు రూ. 69.82గా ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?