HomeNewsBreaking Newsజాతీయ రహదారికి భూములు ఇవ్వబోం

జాతీయ రహదారికి భూములు ఇవ్వబోం

పర్యావరణానికి ప్రమాదం
ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు
కార్పొరేట్ల కోసమే జాతీయ రహదారి నిర్మాణం : బాగం
ప్రజాపక్షం/ ఖమ్మం అర్బన్‌ నాగపూర్‌- గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణానికి తమ భూములను ఇవ్వబోమని పలువురు రైతులు తేల్చి చెప్పారు. నాగపూర్‌- జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఖమ్మం జిలా ల శనివారం రఘునాథపాలెం మండల పరిషత్‌ కార్యాలయం పక్కన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మధుసూదన్‌, ట్రైనీ కలెక్టర్‌ బి. రాహుల్‌, కాలుష్య నియంత్రణ మండలి ఇఇ రవిశంకర్‌, తహసీల్దార్‌ నర్సింహారావు పాల్గొన్నారు. రఘునాథపాలెం మండల పరిధిలో జాతీయ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రఘునాథపాలెం, రేగులచలక, వి. వెంకటాయపాలెం, కామంచికల్‌, దారెడు గ్రామాలకు చెందిన పలువురు రైతులు, వివిధ పార్టీల నాయకులు సమావేశానికి హాజరై తమ భూము లు ఇవ్వమని అధికారులకు తెగేసి చెప్పారు. రహదారి నిర్మాణం వల్ల ఎన్నో ఏళ్లుగా సాగుపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. పండ్లు, కూరగాయలు, వివిధ రకాల పంటలు పండే భూములను కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి నిర్మాణం వల్ల చెట్లు తొలగించాల్సి వస్తుందని, దీని వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. బహిరంగ మార్కెట్‌లో కోట్ల రూపాయల ధర పలికే భూములను తక్కువ ధరకు ప్రభుత్వం తీసుకోవాలని చూస్తుందని, దీంతో తాము ఎంతో నష్ట పోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఖమ్మం చుట్టూ పలు జాతీయ రహదారుల నిర్మాణం చేస్తున్నందున మళ్లీ అమరావతి జాతీయ రహదారి నిర్మాణం అవసరం లేదని, వాటికి అనుసంథానం చేస్తూ ఎలైన్‌మెంట్‌ మార్చాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం నగరానికి కూత వేటు దూరంలో ఉన్న రఘునాథపాలెం మండలం నుంచే నగర ప్రజలకు అవసరమైన కూరగాయలు, పాలు, పండ్లు వంటివి పండించి సరఫరా చేస్తారని రైతులు తెలిపారు. అధికారులు కూడా తమ సమస్యలను పరిగణనలోకి తీసుకుని జాతీయ రహదారి నిర్మాణాన్ని ఆపాలని లేదా ఎలైన్‌మెంట్‌ను మార్చాలని కోరారు. రహదారి నిర్మాణం ఎంత ఎత్తులో చేపడతారో కూడా తెలపాలని రైతులు కోరారు. తప్పనిసరిగా తమ భూమిని తీసుకోవాల్సి వస్తే దానికి ప్రత్యామ్నాయంగా అదే ప్రాంతంలో భూమి కొనుగోలు చేసుకునేలా పరిహారం చెల్లించాలని రైతులు కోరారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌కు నాయకులు, రైతులు అందజేశారు. సమావేశంలో తెలిపిన అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో జాతీయ రహదారి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ దుర్గాప్రసాద్‌, మంత్రాస్‌ గ్రీన్‌ పర్యావరణ కన్సెల్టెన్సీ బాధ్యులు ప్రేమ్‌సాయి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కార్పొరేట్ల కోసమే జాతీయ రహదారి నిర్మాణం : బాగం
నాగపూర్‌- అమరావతి జాతీయ రహదారి నిర్మాణం ప్రభుత్వం కార్పొరేట్ల కోసమే చేస్తుంది తప్ప ప్రజల కోసం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. ఈ జాతీయ రహదారి నిర్మాణం వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని కార్పొరేట్‌ కంపెనీలకే ఉపయోగపడుతుందన్నారు. బహిరంగ మార్కెట్‌లో కోట్లలో పలికే భూములను తక్కువ ధరకు ప్రభుత్వం తీసుకోవడం సరి కాదన్నారు. సాగు భూములు, ఖాళీ స్థలాలు కొనుగోలు చేసిన వారు అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. ఈ రహదారి నిర్మాణం చేపట్టకుండా పలు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని హేమంతరావు తెలిపారు. కురవి, కోదాడ హైవేకు అనుసంధానం చేయడం ద్వారా కోట్ల రూపాయల ప్రజాధనం మిగులుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన 16.5 కిలో మీటర్ల మేర పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని హైవే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సిద్దినేని కర్ణకుమార్‌, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు దొండపాటి రమేష్‌, ప్రజాపంథా నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, వివిధ పార్టీల నాయకులు శాఖమూరి శ్రీనివాసరావు, బొంతు రాంబాబు, మాదినేని రమేష్‌, ఆవుల మంగతాయి, ఎస్‌. నవీన్‌రెడ్డి, రైతులు తక్కెళ్లపాటి భద్రయ్య, తాతా రఘురాం, నున్నా శ్రీనివాసరావు, వేములపల్లి సుధీర్‌కుమార్‌, ప్రతాపనేని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments