ప్రజాపక్షం/సూర్యాపేట ప్రతినిధి
లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతర మంగళవారం జనసంద్రమైంది. లక్షలాది మంది భక్తులు ఆయా ప్రాంతాల నుండి తరలి వచ్చి గట్టుపై ఉన్న లింగన్న, చౌడమ్మ తల్లిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. లింగా… ఓలింగా అంటూ శివనామస్మరణ చేశారు. శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నెత్తిన బోనం… చేతిన వీరచెండుతో శివసత్తులు శివాలెత్తగా… గజ్జెల లాగులు, కాళ్లకు గజ్జెలు, చేతిలో బేరీలు, వీరచెండు భుజాన వీరడోలు వేసుకొని భూమి అదిరేలా నృత్యాలు చేశారు. లింగన్న తమను చల్లంగా చూడాలని మేక, గొర్రెపోతులు, కోళ్ళను చౌడమ్మకు బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. లింగన్నకు పాలకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షణలు చేశారు.
కన్నులపండుగగా చంద్రపట్నం
జాతర 3వ రోజు మంగళవారం పెద్దగట్టుపై స్వామివారి మండపంలో చంద్రపట్నం కార్యక్రమాన్ని యాదవ పూజారులు కన్నులపండుగగా నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన పంచవర్ణములతో వేసిన చంత్రపట్నంపై దక్షణం దిక్కున లింగమంతులస్వామివారిని, ఉత్తర దిక్కున మాణిక్యమ్మ దేవిని కూర్చోబెట్టి కళ్యాణం జరిపించారు. పూజారులు శ్రీ లింగమంతులస్వామి కళ్యాణం కథను, శ్రీకృష్ణుడి చరిత్రపై పాటలు ఆలపించారు. ఈ సందర్భంగా దేవాలయ ట్రస్టుబోర్డు చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్ మాట్లాడుతూ చంద్రుడు ఆకాశంలో నిండుగా ప్రకాశించే పౌర్ణమి రోజు శ్రీ లింగమంతులస్వామివారికి ఇష్టమైన రోజు అని ప్రతి పౌర్ణమికి భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం ఆచరించి తడిబట్టలతో దర్శనం చేసుకొని గట్టుపై నిద్ర చేస్తే తాము కొరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకమని చెప్పారు. రెండేళ్ళకు ఒకసారి మాఘశుద్ద పౌర్ణమి రోజు నుండి ఐదు రోజులు జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో మెంతనబోయిన, తండు వంశీలు, భైరానీ తేరాచీరల యాదవ పూజారులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
లింగన్నను దర్శించుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
శ్రీ లింగమంతులస్వామిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకొని స్వామివారికి మొక్కులు చెల్లించారు. కవిత చౌడమ్మ తల్లికి బోనం వండుకొని నెత్తినపెట్టుకొని కొట్టపైకి ఎక్కి సమర్పించింది. మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జ దీపికయుగేందర్ రావులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
3వ రోజు కూడా జాతీయ రహదారిపై వాహనాల మళ్లింపు
శ్రీ లింగమంతులస్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా హైద్రాబాద్-విజయవాడ 65వ ప్రధాన జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల మళ్లింపును కొనసాగించారు. హైద్రాబాద్ నుండి వచ్చే వాహనాలను నార్కెట్ నుండి నల్లగొండ మీదుగా మిర్యాలగూడ, హూజూర్ కోదాడకు మళ్లించగా, విజయవాడ నుండి వచ్చే వాహనాలను కోదాడ నుండి హూజూర్ నగర్ మీదుగా మిర్యాలగూడ, నల్లగొండ, నార్కెట్ మళ్లించారు. జిల్లా ఎస్ సన్ ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో జాతరలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.