జవాను క్షేమం

ఫొటో విడుదల చేసిన మావోయిస్టులు
జవాను బంధువుల రాస్తారోకో
బిజాపూర్‌/జమ్ము : ఛత్తీస్‌గఢ్‌లో ఏప్రిల్‌ 3వ తేదీన మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల సంఘటనలో జాడతెలియకుండా పోయిన కోబ్రా కమాండో రాకేశర్‌ సింగ్‌ మిన్హాస్‌ ను మావోయిస్టులు అపహరించుకుపోయారు. ఈ విషయాన్ని మావోయిస్టులే ధృవీకరించారు. అతడిని వదిలిపెడతామని, మధ్యవర్తులెవరో తమకు తెలియజేయాలని మావోయిస్టుల తరపున ఒక లేఖ వెలువడింది. అపహరణకు గురైన కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ ఫొటో ను మావోయిస్టులు విడుదల చేశారు. ఆ ఫొటోను బట్టి చూస్తే, అతడికి ఎలాంటి ప్రాణహాని మావోయిస్టులు తలపెట్టలేదని, అతడు సురక్షితంగానే ఉన్నాడని తెలుస్తున్నది. ఒక అటవీ ప్రాంతంలో తాటాకులతో నిర్మించిన చిన్న తాత్కాలికమైన గుడిసె వంటి ప్రదేశంలో టార్పాలిన్‌ పైన రాకేశ్వర్‌ కూర్చుని ఉన్న దృశ్యాన్ని మావోయిస్టులు సోషల్‌ మీడియాలో పెట్టారు. 210 కోబ్రా బెటాలియన్‌కు చెందిన రాకేశ్వర్‌ సింగ్‌ మిన్హాస్‌ సస్థలం జమ్మూకశ్శీర్‌లోని బర్నాయ్‌. అతడు నక్సల్స్‌ చెరలో ఒంటరిగా కూర్చున్న దృశ్యం కనిపించింది. దీనిపై బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సుందర్రాజ్‌ పి. పిటిఐ వార్తాసంస్థతో బుధవారంనాడు మాట్లాడుతూ, పరిస్థితిని చాలా సన్నిహితంగా గమనిస్తున్నామని, దీనిపై తక్షణం మాట్లాడబోమని అన్నారు. అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, జవాను భద్రతకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని ఆయన అన్నారు. తమ కార్యకర్తలు మన్హాస్‌ను అపహరించుకుని తీసుకువచ్చారని పేర్కొంటూ హిందీలో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. జవానును సురక్షితంగా విడుదల చేయాలంటే ఒక మధ్యవర్తిని నియమించాలని మావోయిస్టులు డిమాండ్‌ చేశారు. దీనిపై ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం ఇంతవరకు ఏవిధంగానూ స్పందించలేదు. వికల్ప్‌ పేరిట మావోయిస్టులు ఈ ప్రకటన విడుదల చేశారు. వికల్ప్‌ దండకారణ్య మావోయిస్టులు, నక్సలైట్ల స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రతినిధిగా వెలుగులోకి వచ్చాడు. ఇప్పటివరకు జవాను తమ రక్షణలో సురక్షితంగానే ఉన్నాడని ఆ లేఖలో వికల్ప్‌ పేర్కొన్నాడు. అయితే మావోయిస్టులు సంప్రదాయబద్ధంగా జవానును విడుదల చేసినందుకు ప్రతిగా నెరవేర్చాలని కోరుతూ ఆ లేఖలో ప్రభుత్వానికి ఎలాంటి డిమాండ్లు చేయలేదు. అసలు ఈ లేఖ మావోయిస్టులదేనా? లేక ఆ లేఖ ఆకతాయిలు రాసిన నకిలీదా? అందులో ఉన్న వాస్తవికత ఎంత? అనే విషయాలను భద్రతా దళాలు సునిశితంగా పరిశీలిస్తున్నాయి. ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు స్థానిక గ్రామస్తులను ఆరా తీస్తున్నారు. గాలింపు చేస్తున్నారు. స్థానిక సామాజిక సంస్థలను, ప్రభుత్వ ప్రతినిధులను, జర్నలిస్టులను, ఆఫీసర్లను ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా, అపహరణకు గురైన జవానును విడుదల చేయాలని మావోయిస్టులను కోరేందుకు గిరిజన కార్యకర్త సోని సోరి బుధవారంనాడు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి బయలుదేరి వెళ్ళారు. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకోవాల్సింది, అయితే నేను ఎవరికోసం ఎదురుచూడదల్చుకోలేదు, నేను ఆ సంఘటన ప్రదేశానికి వెళుతున్నాను అన్నారు సోని సోరి.
జమ్మూ-ఫూంచ్‌ రహదారిపై
జవాను బంధువుల రాస్తారోకో
మావోయిస్టులు అవహరించిన జవాను రాకేశ్వర్‌సింగ్‌ మిన్హాస్‌ సస్థలం జమ్మూ కశీర్‌లోని బర్నాయ్‌. అతడి బంధువులు, ఇరుగుపొరుగువారు బుధవారంనాడు పెద్ద సంఖ్యలో జమ్మూ-పూంఛ్‌ జాతీయ రహదారిపై గుమిగూడి రాస్తారోకో చేశారు. రాకేశ్‌ను వెంటనే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కేంద్రం ఇంతవరకు అతడి విడుదలకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు. రాకేశ్వర్‌సింగ్‌ మిన్హాస్‌ భార్య మీనూ ప్రధాని తన భర్తను సురక్షితంగా తమ వద్దకే చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేశారు. రాకేశ్‌ బంధువులు పెద్ద సంఖ్యలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మిన్హాస్‌ సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌లో కోబ్రా దళానికి చెందినవాడు. 210 బెటాలియన్‌ సభ్యుడు. లాంగ్‌ లివ్‌ ఇండియా, మా హీరోను తిరిగి ఇంటికి పంపించండి, దేశద్రోహులనుకాల్చి చంపండి అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసు అధికారులు ఆ ప్రదేశానికి చేరుకుని రాస్తారోకో చేస్తున్న జవాను బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆ మార్గంలో వెళుతున్న ట్రాఫిక్‌ను దారి మళ్లించి వారిని శాంతపరిచారు.

DO YOU LIKE THIS ARTICLE?