ఉగ్రవాదులకు ఆర్థిక సాయం కేసులో ఎన్ఐఎ కోర్టు తీర్పు
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు భారీగా ఆర్థిక సాయం చేశాడని, ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటు న్న జమ్మూకశ్మీర్ వేర్పాటువాద ఉద్యమ నాయకుడు యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు శిక్షను విధిస్తూ పటియాలా ఎన్ఐఎ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జెకెఎల్ఎఫ్) చీఫ్ మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలన్న ప్రాసిక్యూటర్ వాదనతో కోర్టు ఏకీభవించలేదు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) చట్టంలోని సెక్షన్ 17 (ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం)తోపాటు భారత శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్ 121 (భారత ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటించడం) కింద కూడా మాలిక్‌పై కేసులు నమోదయ్యాయి. దేశ ద్రోహానికి పాల్పడడమేగాక, దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు కుట్ర పన్నిన మాలిక్‌కు ఉరి శిక్ష ఒక్కటే సరైన శిక్ష అంటూ ప్రాసిక్యూషన్ తన వాదన వినిపించింది. అంతకు ముందే తనపై ఆరోపించిన నేరాలను మాలిక్ అంగీకరించడంతో, అతని తరఫు లాయర్ వాదించడానికి పెద్దగా ఏమీ లేకపోయింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి, ఇరు వర్గాల వాదనలు విన్న పటియాలా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ సింగ్ తీర్పును వెల్లడించారు. మాలిక్‌కు జీవిత ఖైదు విధించడమేగాక, పది లక్షల రూపాయల జరిమానా కూడా చెల్లించాలని స్పష్టం చేశారు.
మైసుమాలో ఘర్షణలు
యాసిన్ మాలిక్‌కు పటియాలా స్పెషల్ ఎన్ఐఎ కోర్టు తీర్పు చెప్పడానికి ముందే శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో ఘర్షణలు చెలరేగాయి. మహిళలు, పిల్లలుసహా వందల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన జెకెఎల్ఎఫ్ మద్దతుదారులు ఆందోళనకు దిగారి. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో గుమిగూడి మాలిక్‌కు అనుకూలంగా నినాదాలిచ్చారు. కొంత మంది రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని చెదరగొట్టడానికి భద్రతా బలగాలు ప్రయత్నించడంతో, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే, భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా, తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీస్ అధికారులు అన్ని రకాలుగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భద్రతను మరింత పెంచారు.
జమ్మూకశ్మీర్ వేర్పాటువాద ఉద్యమ నేత యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు
RELATED ARTICLES