బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి
6 నెలలుగా రాష్ట్రంలో రాజకీయ అస్థిరత
రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపిన కేంద్రం
న్యూఢిల్లీ: జమ్మూ-కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి పాలన బుధవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానుంది. జమ్మూ-కాశ్మీర్లో బుధవారంతో గవర్నర్ పాలన ముగిసిపోయింది. దీంతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర సర్కారు సూచన మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జమ్మూ-కాశ్మీర్లో రాష్ట్రపతి పాలనకు ఆమోదముద్ర వేస్తూ సంతకం చేశారు. దీంతో ప్రస్తుతం జమ్మూ-కాశ్మీర్‌కు సంబంధించిన అన్ని రకాల కార్యానిర్వహక అధికారాలను ఇక నుంచి కేంద్ర క్యాబినేట్ తీసుకొనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 74(1) ప్రకారం రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గ సూచనల మేరకు తన అధికారాలను ఇక్కడ వినియోగించనున్నారు. ఇక జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంకు సంబంధించిన ప్రత్యేక రాజ్యాంగంలోని ఆర్టికల్ 92 ప్రకారం అసెంబ్లీ రద్దున గవర్నర్ 6 నెలల వరకు కార్యానిర్వహణ బాధ్యతలను చేపట్టవచ్చు. అయితే రాష్ట్రంలో పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవని గవర్నర్ సత్యపాల్ రాష్ట్రపతి పాలనకే మొగ్గు చూపడం విశేషం. ఇక జమ్మూ-కాశ్మీర్లో ఈ ఏడాది జూన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. పిడిపి నేతృత్వంలోని మెహబూబా సర్కారుకు శాసన సభలో 25 మంది ఎమ్మెల్యేల బలమున్న బిజెపి తన సపోర్ట్ ఉపసంహరించుకుంది. దీంతో మెహబూబా సర్కారు పడింది. అయితే పిడిపి ప్రభుత్వం కూలిపోయిన దాదాపు 5 నెలల తర్వాత కాంగ్రెస్, పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పా టు చేసేందుకు ముందుకు వచ్చాయి. వీరితో పాటు ఇద్దరు సభ్యులున్న పిపుల్స్ కాన్ఫరెన్స్,ఇతర సభ్యుల మద్దతుతో తాము కూడా సర్కారును ఏర్పాటు చేస్తామని బిజెపి గవర్నర్‌కు విన్నవించింది. దీంతో గవర్నర్ సత్యపాల్ ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించ కుండా నవంబర్ 21న శాసన సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయ అస్థిరత ఉన్నందునే అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
అప్పటి నుంచి రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతుండగా..తాజాగా గవర్నర్ పాలన బుధవారంతో ముగిసినందున ప్రెసిడెంట్ రూల్ పెట్టాలని కేంద్ర మంత్రివర్గానికి ఆయన సిఫార్స్ చేశారు. దీంతో గవర్నర్ నివేదికను పరిశీలించిన కేంద్ర క్యాబినేట్ జమ్మూ-కాశ్మీర్లో రాష్ట్రపతి పాల న పెట్టాలని ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్‌కు సిఫార్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి కోవింద్ జమ్మూ-కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.