HomeNewsBreaking Newsజన జాతర

జన జాతర

అట్టహాసంగా మేడారం జాతర ప్రారంభం
గద్దెపైకి చేరుకున్న సారలమ్మ
కొలువుదీరిన పగిడిద్దరాజు, గోవిందరాజులు
నేడు తల్లి సమ్మక్క ఆగమనం
వరంగల్‌బ్యూరో : నిన్నటి దాకా ఒక కుగ్రామంగా ఉన్న మేడారం నేడు మహానగరంగా మారి జన జాతరకు స్వాగతం పలికింది. లక్షలాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య మహా జాతర ప్రారంభమైం ది. మేడారం చుట్టూ పది కిలోమీటర్ల మేర తరలివచ్చిన భక్తజనంతో ఆ ప్రాంతం ఆధ్యాత్మికతతో పులకించింది. లక్షలాది మంది ప్రజలు ఎదురు చూసిన జాతర ఘట్టాని కి సమయం ఆసన్నమై మేడారం ఆడబిడ్డ సారలమ్మ గద్దె పై కొలువుదీరింది. దీంతో బుధవారం ధీరవనితల ఉత్సవానికి అంకురార్పణ జరిగినట్లుంది. భక్తజనుల హోరు లో, శివసత్తుల పూనకాలు, గిరిజన పూజారులు భారీ బందోబస్తు మధ్య సారలమ్మను కన్నెపల్లి నుండి మేడారంలోని గద్దెకు చేర్చారు. అలాగే సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దెలపై కొలువుదీరారు. అంతకు ముందే సమ్మక్క కొడుకు జంపన్నను ప్రతిష్టించారు. కన్నెపల్లి నుండి సారలమ్మతో బుధవారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరిన పూజారులు మే డారం వరకు మేళతాళాలు, చప్పుళ్ల మధ్య నాలుగున్నర కిలోమీటర్ల దూరం నడిచి అమ్మవారిని మేడారం గద్దెలపై ప్రతిష్టించారు. అలాగే ఏటూరునాగారం మం డలం కొండాయి నుండి గోవిందరాజును మధ్యాహ్నం నుండే పూజల అనంతరం 16 కిలోమీటర్ల ప్రయాణాన్ని కొనసాగించి తాడ్వాయి మండలంలోని ఊరట్టం మీదు గా మేడారం చేరుకొని ప్రతిష్టించారు. ఇక గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజును తీసుకొని మంగళవారం నుండే పూజారులు దాదాపు 60 కిలోమీటర్ల మేర కాలి నడకన ప్రయాణం చేసి బుధవా రం రాత్రి గద్దెల ప్రాంగణానికి చేరుకొని ప్రతిష్టించారు. ఆదివాసీలకు పవిత్ర వారమైన బుధవారం రాత్రి వనదేవతలు గద్దెలపైకి రావడంతో జాతర సంబురాలు అంబరా న్ని తాకాయి. అడవి తల్లుల ఆగమనానికి ముందే మే డారం జనగుడారంగా మారింది. బుధవారం జాతర ప్రారంభం కానుండడంతో మూడు రోజుల పాటు మేడారంలోనే ఉండి తల్లులను దర్శించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. బుధవారం రోజు మహాజాతర ప్రారంభం కావడంతో జనం కిక్కిరిసిపోయారు. గురువారం సాయంత్రం చిలుకలగుట్ట మీద నుండి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి అత్యంత భక్తి శ్రద్ధ్దలతో తీసుకురానున్నారు. అప్పటి నుం డి సమ్మక్క- గోవిందరాజు, పగిడిద్దరాజులు భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ క్షణాల కోసమే ఎదురు చూస్తున్న భక్తులు రాత్రి పగలు తేడా లేకుండా అమ్మవార్లను దర్శించుకుంటూ మొక్కలు చెల్లిస్తున్నారు.
7న మేడారంకు సిఎం, గవర్నర్‌, కేంద్రమంత్రులు
మహాజాతరకు ఈనెల 7న ముఖ్యమంత్రి కెసిఆర్‌, రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖామంత్రులు వస్తున్నట్లు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం మహాజాతర మొదటి ఘట్టం ప్రారంభమైనందున జాతరకు వచ్చిన లక్షలాది మంది భ క్తులకు ఎలాంటి అసౌకర్యం ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సోమేశ్‌కుమార్‌ జాతర విధుల నిర్వహణ లో చేరారు. జాతర పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి విధులు నిర్వర్తించనున్నట్లు ఆయన చెప్పారు. సమ్మక్క జాతర నిర్వహణ చేసే అదృష్టం తనకు దక్క డం నాపూర్వజన్మ సుకృతమన్నారు. మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు రాష్ట్ర యంత్రాంగాన్ని జాతరలో అప్రమత్తం చేసినట్లు చెప్పారు. సమ్మక్క ఆగమనం తరువాత 7న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో పా టు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై వస్తున్నట్లు ఆయన చెప్పారు. వారితో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి గిరిజన సంక్షేమ శాఖమంత్రి కూడా జాతరకు రానున్నట్లు పేర్కొన్నారు. జాతరలో ఉన్న భక్తులతో పాటు ముఖ్యమంత్రి వస్తున్నందున భారీ భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం నుండి జాతరలో సిఎస్‌ పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షను నిర్వహించారు. మహాజాతరకు ముఖ్యమంత్రి సహా ఇతర అధికారులు వస్తున్నందున భారీ భద్రతా చర్యలు చేపట్టాలని డిజిపి మహేందర్‌రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments