జట్టుగా నడుద్దాం!

రాహుల్‌, అఖిలేష్‌, మాయావతి, శరద్‌పవార్‌, శరద్‌యాదవ్‌, సురవరం, రాజా, ఏచూరి, కేజ్రీవాల్‌లతో టిడిపి చీఫ్‌, ఎపి సిఎం చంద్రబాబునాయుడు భేటీ

బిజెపియేతర కూటమి ఏర్పాటే లక్ష్యంగా మంతనాలు
ఢిల్లీ, లక్నోలలో ఎపి సిఎం సుడిగాలి పర్యటన
పవార్‌తో సిపిఐ నేతల సమావేశం
సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్‌ చర్చలు

న్యూఢిల్లీ/లక్నో: సార్వత్రిక ఎన్నికల తుది అంకం మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో హస్తినలో అధికారం హస్తగతం చేసుకునే దిశగా ముందస్తు ఎత్తుగడలు మొదలయ్యాయి. ప్రతిపక్షా ల నేతలందరినీ ఓట్ల లెక్కింపు రోజునే (మే 23న) కలవాలని కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ ఓవైపు ప్రయత్నాలు ప్రారంభించగా, మరోవైపు బిజెపియేతర కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రతిపక్షాల నుంచి కూడా కృషి మొదలైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు శనివారంనాడు ఢిల్లీ, లక్నోలలో పర్యటించి, జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌గాంధీ, ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ నేత శరద్‌ యాదవ్‌, సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, కార్యదర్శి డి.రాజా, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలతో సమావేశమై, సుదీర్ఘ సంప్రదింపులు జరిపారు. వెంటనే లక్నో వెళ్లి అక్కడ సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పి) అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌,బిఎస్‌పి నాయకురాలు మాయా వతిలను కలిసి, చర్చలు జరిపారు. ఈ నాయకులందరితో చంద్రబాబు జరిపిన చర్చల్లో తాజా రాజకీయ పరిస్థితులతోపాటు ఎన్నికల అనంతరం బిజెపియేతర కూటమి ఏర్పాటు దిశగా చేపట్టాల్సిన చర్యలు, చొరవల గురించి ప్రస్తావించారు. ఎన్నికలు తుది దశకు చేరుకున్న దృష్ట్యా చంద్రబాబు పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నది. చంద్రబాబునాయుడు శుక్రవారంనాడే ఢిల్లీ చేరుకొని సాయంత్రమే ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఇక శనివారం ఉదయం ఏపీ భవన్‌లో సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, డి.రాజాతో సమావేశమై మే 23 ఎన్నికల ఫలితాల అనంతరం భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఆ తర్వాత ఏపీ భవన్‌ నుంచి నేరుగా రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యా రు. ఈనెల 19న తుదివిడత పోలింగ్‌ ముగియనుండటంతో ఎన్డీఏకు ఎన్నిసీట్లు వచ్చే అవకాశముంది, యూపీఏకు ఎన్ని సీట్లు వస్తాయి, మే 23 తర్వాత అనుసరించాల్సిన కార్యాచరణ.. తదితర అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఎన్డీయేతర కూటమిని బలోపేతం చేసేందుకు ఇంకా.. ఏయే పార్టీల నేతలతో చర్చలు జరపాలి అనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోం ది. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు చర్చించారు. రాహుల్‌తో భేటీ తర్వాత శరద్‌పవార్‌, శరద్‌ యాదవ్‌లతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్డీయేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా చం ద్రబాబు పర్యటన కొనసాగింది. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ నుంచి నేరుగా లక్నో బయలుదేరి వెళ్లారు. అక్కడ ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ను కలుసుకున్నారు.ఎన్డీయేతర కూటమి ఏర్పాటు అంశంపై కొన్ని గంటలపాటు చర్చలు జరిపారు. ఆ తర్వాత మాయావతిని కలిసి ఇదే అంశంపై ముచ్చటించారు.లక్నోలో మాత్రం చంద్రబాబు మీడియాతో మాట్లాడలేదు. చంద్రబాబుకు స్వాగతం పలికామని, పలు రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడారని అఖిలేష్‌ యాదవ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలో చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలంతా ఒకతాటిపైకి రావాలన్నది తన ప్రయత్నమని చెప్పారు. “మేమంతా కలిసి నడవాలి. కలిసి పనిచేయాలి” అని చెప్పారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌) అధినేత కె చంద్రశేఖర్‌రావుతో చేతులు కలుపుతుందా?అని శుక్రవారం మీడియా చంద్రబాబును ప్రశ్నించగా..‘భాజపాను వ్యతిరేకించే ఏ పార్టీనైనా మాతో కలుపుకొని పోతాం. టిఆర్‌ఎస్‌ మాత్రమే కాదు అలాంటి పార్టీలన్నింటిని మా మహా కూటమిలో భాగం చేసుకుంటాం’ అని ఆయన సమాధానమిచ్చారు.రాహుల్‌గాంధీతో చంద్రబాబు భేటీ ముగిసిన కొద్దిసేపటి తర్వాత రాహుల్‌తోపాటు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ యుపిఎ ఛైర్‌పర్సన్‌ సోనియాగాంధీ నివాసానికి చేరుకొని, ఆమెతో సమావేశమయ్యారు. పార్టీ వ్యూహంపై వారు చర్చించినట్లు సమాచారం. “సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది.ఆఖరి దశ పోలింగ్‌ కోసం ఎదురుచూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చి కలిశారు. భవిష్యత్‌ కార్యాచరణంపై ఇరువురం చర్చించాం” అని శరద్‌పవార్‌ ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత చంద్రబాబు, సురవరం సుధాకరరెడ్డి, డి.రాజాలు ఎపి భవన్‌లో అల్పాహార విందులో పాల్గొని, అక్కడే వివిధ అంశాలపై చర్చించారు. కలిసి నడుద్దామని చంద్రబాబు వారిని కోరారు. ఆ తర్వాత సురవరం సుధాకరరెడ్డి, డి.రాజాలు శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లి, ఆయనతో చర్చలు జరిపారు. ఇప్పటికే చంద్రబాబునాయుడు తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌, సిపిఐ(ఎం) నాయకుడు ఏచూరితో పలు మార్లు భేటీ అయ్యారు. ఇదిలావుండగా, కేంద్రంలో ప్రతిపక్షాలన్నీ ఒక తాటిపైకి వస్తున్న తరుణంలో కర్నాటక రాష్ట్రంలో జెడి(ఎస్‌), కాంగ్రెస్‌ నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం తగ్గించుకోవాలని కన్నడ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కోరారు. ఈ సమయంలో వివాదాస్పద ప్రకటనలు చేసుకోవద్దని ఆయన ట్వీట్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?