అటవీ అధికారుల కనుసన్నల్లోనే తరలిపోతున్న కలప
ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు
ప్రజాపక్షం/ ఖమ్మం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మునుపెన్నడు లేని రీతిలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ మొక్కలు నాటే పని చేపట్టింది. ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచేందుకు కార్యాచరణ చేపడితే అటవీ అధికారులు మాత్రం ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. కలప స్మగ్లర్లతో చేతులు కలిపి అడవులను హరించివేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని పెద్ద పెద్ద మాను లు తరలిపోతున్నాయి. కలప తరలింపు మొత్తం అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. విషయం బయటకు వస్తే అరకొర చర్యలు తీసుకోవడం మినహా ఆధారాలు ఉన్నా అటవీ అధికారుల పైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కలప తరలింపు ఒక ప్రాంతానికో, ఓ మండలానికో పరిమితం కాలేదు. ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తం గా హరితహారాన్ని మించి చెట్ల నరుకుడు కార్యక్రమం జరుగుతుంది. ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లోని రిజర్వు ఫారెస్టులో దశాబ్దాల వయస్సు కలిగిన మారు జాతి వృక్షా లు గల్లంతయ్యాయి. రంపాలతో కోసి సైజులుగా చేసి ట్రాక్టర్ల ద్వారా తరలించుకుపోతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం అటవీ శాఖ బీట్ ఆఫీసర్లు, గార్డులకు తెలిసే జరుగుతుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కారేపల్లి అటవీ ప్రాంతంలోని విలువైన 20 వేపచెట్లను స్థానిక బీట్ ఆఫీసర్ కలప స్మగ్లర్లతో కుమ్మకై నేల కూల్చారు. ఈ విషయం బయటకు రాగానే తూతూ మంత్రంగా కలప వ్యాపారులకు జరిమానా విధించి కేసును నీరుగార్చారు. ఇక్కడి అటవీ అధికారి విషయం బయటకు పొక్కిన తర్వాత కూడా మీడియాతో పాటు స్థానిక రాజకీయ నాయకులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. కలప వ్యాపారులతో కుమ్మకై పెద్ద మొత్తంలో పుచ్చుకుని కలపను నరికేందుకు అనుమతించారన్న వార్తలు కూడా వచ్చాయి. టేకులపల్లి మండలం సిద్దారం అడవుల్లోనూ అదే జరిగింది. విలువైన మారుజాతి కలపను నరికి యధేచ్చగా తరలించుకుపోతున్న అటవీ శాఖాధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అడవులు క్రమేపి పలచబడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అడవుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతుంది. పచ్చదనాన్ని పెంచే క్రమంలో కొత్తగా మొక్కలను నాటడమే కాకుండా గతంలో ఉన్న మొక్కలను రక్షించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక హరితహారంలోనూ అటవీ అధికారుల తీరు సరిగ్గా లేదు. వేలాది మొక్కలను తీసుకెళ్లి అటవీ ప్రాంతాలలో పడేశారు తప్ప నాటిన సందర్భాలు బహు తక్కువ. అటవీ అధికారుల పరిధిలో హరితహారం మొక్కలు కూడా చాలా చోట్ల ఆశించినవిధంగా లేకపోవడం గమనార్హం. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి పచ్చదనం కోసం పరితపిస్తుంటే కంచె చేను మేసిన చందంగా అటవీ అధికారులు కలప తరలిపోయేందుకు యధాశక్తి సహకరిస్తున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా అడవుల నుంచి తరలిపోతున్న నాణ్యమైన కలప విషయమై ప్రత్యేక విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. కలప స్మగ్లర్ల నుంచి అడవులను కాపాడాలని కోరుతున్నారు.
చేను మేస్తున్న కంచె
RELATED ARTICLES