జిహెచ్‌ఎంసిలో నిలిచిపోయిన కార్మికుల ఇఎస్‌ఐ, పిఎఫ్ చెల్లింపులు
మే నుంచి ఖాతాల్లో జమకాని డబ్బులు
ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో స్తంభించిన వైద్య చికిత్సలు
ప్రజాపక్షం/హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జిహెచ్‌ఎంసి) కార్మికుల సంక్షేమంపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికుల ఖాతాల్లో ఇఎస్‌ఐ, పి ఎఫ్ డబ్బులు జమ చేయడం లేదని కార్మిక సంఘాలు చెప్పుతున్నాయి. మే నెల నుంచి చెల్లింపు ఆగిపోయాయని అంటున్నారు. కార్మికులు అనారోగ్యానికి గురైతే ఇఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లితే చికిత్సలు చేయడం లేదంటున్నారు. అంతేకాకుండా ఎవరైనా మరణిస్తే కూడా వారి పిఎఫ్ డబ్బులు విడుదల చేయడానికి అడ్డంకులు ఎదురవుతున్నాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ కార్మికులకు ఇఎస్‌ఐ, పిఎఫ్ వ్యవహారాలు చూసేందుకు సిఎన్‌ఆర్ అసోసియేట్స్ అనే సంస్థకు బాధ్యతలు అప్పగించారు. టెండర్ ద్వారా ఈ బాధ్యతలు స్వీకరించిన సదరు సంస్థ కార్మికుల ఖాతాల్లో ఇఎస్‌ఐ, పిఎఫ్ డబ్బులు జమచేయడం లేదని కార్మికులు అంటున్నారు. క్రమం తప్పకుండా కార్మికుల ఖాతాల్లో జమ చేస్తేనే వారికి ఇఎస్‌ఐ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందిస్తారు. చెల్లింపులు మధ్యలో నిలిపేస్తే అపరాద రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా గతంలో కాంట్రాక్ట్ సంస్థ ఇదే మాదిరిగా మధ్యలో చెల్లింపులు నిలిపేయడంతో సుమారు రూ.20 కోట్ల వరకు అపరాద రుసుంను జిహెచ్‌ఎంసి చెల్లించిందని తెలిసింది. చెల్లింపులు మధ్యలో నిలిపేసిన నేపథ్యంలో మరోసారి జిహెచ్‌ఎంసినే అపరాద రుసుం చెల్లిస్తుందా? లేక సదరు కాంట్రాక్ట్ సంస్థ నుంచి కట్టిస్తారా? అనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జిహెచ్‌ఎంసిలో వివిధ కేటగిరీల్లో సుమారు 30 వేల వరకు ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య, ఎంటమాలాజీ, కంప్యూటర్ ఆపరేటర్లు, హౌస్‌కిపింగ్, సెక్యూరిటీ, పార్కుల్లో తదితర విభాగాల్లో కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో సైతం ఉద్యోగులు, కార్మికులు ప్రాణాలకు తెగించి మరి విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో వారు ఆనరోగ్యానికి గురైతే ఆసుపత్రికి వెళ్తే చికిత్సలు అందని పరిస్థితులు నెలకొన్నాయి. ఇఎస్‌ఐ, పిఎఫ్ వ్యవహారాల చూసుకోవాల్సిన కాంట్రాక్ట్ సంస్థ క్రమం తప్పకుండా ఉద్యోగులు, కార్మికుల ఖాతాల్లో వాయిదాలు చెల్లిస్తుందా? లేదా? అనే విషయాన్ని ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతోనే సదరు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు, కార్మికుల సంక్షేమం, ఇతర వ్యవహారాలు పర్యవేక్షించేందుకు జిహెచ్‌ఎంసిలో అదనపు కమిషనర్ అడ్మిన్ ప్రత్యేకంగా ఉన్నారు. సదరు అధికారి ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. అలాగే సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు సైతం కార్మికుల ఇఎస్‌ఐ, పిఎఫ్ వంటి ముఖ్యమైన అంశాలను పట్టించుకోకపోవడంతో కాంట్రాక్ట్ సంస్థ మరింత నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉద్యోగులు, కార్మికుల సంక్షేమంపై దృష్టిసారించాలని జిహెచ్‌ఎంసి కమిషనర్‌ను కార్మిక సంఘాలు కొరుతున్నాయి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్మిక్రమాలు నిర్వహిస్తామని జిహెచ్‌ఎంఇయు అధ్యక్షులు ఊదరి గోపాల్ హెచ్చరించారు.
చెల్లింపుల్లేవ్..!
RELATED ARTICLES