‘చెత్త’ మోత!

పట్టణాల్లో “చెత్త యూజర్‌ చార్జీల’ భారం
వసూలు బాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీలకు
జోన్లు, కేటిగిరీలు ఖరారు
ప్రతి నెలా రూ. 500 నుంచి రూ. 10వేలు
మున్సిపల్‌ శాఖ ప్రతిపాదనలు సిద్ధం
ప్రజాపక్షం/హైదరాబాద్‌
అసలే కరోనా కాలం. ఆపైన అంతంత మాత్ర మే సాగుతున్న వ్యాపారాలు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చెత్త సేకరణ పేరుతో పట్టణాల్లో ఉన్న వ్యాపారాలపై ‘యూజర్‌ చార్జీ’ల మోత మోగనుంది. ఆయా వ్యాపార సంస్థను బట్టి ప్రతి నెలా సుమారు రూ.500 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించి మున్సిపల్‌ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా చెత్త సేకరణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మున్సిపల్‌ శాఖ స్థానిక మున్సిపాలిటీలను ఆదేశించింది. ఈ ఏజెన్సీ ద్వారా ‘చెత్త యూజర్‌ చార్జీ’లను వసూలు చేస్తారు. యూజర్‌ చార్జీలను చెల్లించని వ్యాపార సంస్థలపై జరిమానా విధించేందుకు కూడా మున్సిపల్‌ శాఖ సన్నద్ధమవుతోంది. నూతన మున్సిపల్‌ చట్టం-2019, సాలిడ్‌ వెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ -2016 చట్టాల పేరు తో పట్టణాల పారిశుద్ధ్యం, పరిశుభ్రత అంటూ చెత్త సేకరణ బాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనుంది. ఇందుకు సంబంధించిన పాలసీ, మార్గదర్శకాలను మున్సిపల్‌ శాఖ ఇటీవల విడుదల చేసింది. చెత్త సేకరణను ‘తడి, పొడి, ప్రమాదకర చెత్త’ ఇలా మూడు విభాగాలుగా విభజించింది. ఐదు కేటగిరీలను గుర్తించింది. ఇందులో సుమారు 22 రకాలకు యూజర్‌ చార్జీలను దాదాపు ఖరారు చేసింది. ప్రతి నెలా యూజర్‌ చార్జీలను వసూలు చేసే బాధ్యత ఇక ఏజెన్సీలకు అప్పగించనుంది. చెత్త సేకరణ టెండర్‌
ప్రక్రియను మొదలు పెట్టేందుకు మున్సిపల్‌ శాఖ రంగం సిద్ధం చేయడంతో పాటు టెండర్‌ విధానాలను, నిబంధనలను సిద్ధం చేసింది. ఆయా మున్సిపాలిటీల్లో జనభా ఆధారంగా షాపులు, జోన్లను విభజించి ఆయా ఏజెన్సీలకు చెత్త సేకరణ బాధ్యతలను అప్పగించనుంది. కాగా ఒక ఏజెన్సీకి రెండు జోన్లకు మించి టెండర్‌ ఇవ్వకూడదనే నిబంధనలు విధించినట్టు తెలిసింది. పైగా ప్రస్తుతం చెత్త సేకరణకు మున్సిపాలిటీలు వినియోగిస్తున్న తమ సొంత వాహనాలను కూడా సదరు ఏజెన్సీలకు అప్పగించనున్నారు. ఏజెన్సీలకు అప్పగించే ముందు ఆ వాహనాల ఫిట్‌నెస్‌, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ను (ఏడు రోజులకు మించకుండా) జత చేయాల్సి ఉంటుంది. సదరు కాంట్రాక్ట్‌ ముగిసిన తర్వాత ఏజెన్సీ కూడా ఇదే పద్ధతిలో అప్పటి వాహన తాజా పరిస్థితి, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ను జత చేసి, తిగిరి మున్సిపాలిటీకి అప్పగించాలి. అలాగే నిర్మాణ వ్యర్థాలను కూడా సేకరించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి స్థానిక సంస్థలు నిర్ణయించిన ధరలన ఆయా ఏజెన్సీలు వసూలు చేయాల్సి ఉంటుంది.
జోన్ల వారీగా విభజన
మున్సిపాలిటీల పరిధిలో జనాభా ఆధారంగా షాపులను నిర్ణయించనున్నారు. 25 వేల జనాభాకు 10 షాపుల చొప్పున జోన్లు, 20వేల నుంచి 50 వేల జనాభాకు 20 షాపులు, 50 వేల జనాభా నుంచి లక్ష జనాభా వరకు 50 షాపులు, ఒక లక్ష నుంచి 3 లక్షల జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 75 షాపులు, 3 లక్షలకు మించిన జనాభా ఉన్న మున్సిపాలిటీలో 100 షాపులు ఇలా కేటగిరీలు, జోన్లుగా విభజిస్తారు. ఆయా మున్సిపాలిటీలు తమ జనాభా ఆధారంగా జోన్ల పరిధిలోని వాణిజ్య సంస్థలు, గృహాల ప్రాంతాలు, సుమారు చెత్త వ్యర్థాల సామర్థ్యం , యూజర్‌ చార్జీల మొత్తం ఇలా ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. చెత్త సేకరణకు సుమారుగా ఐదు కేటగిరీలను విభజించినట్టు తెలిసింది. ఇందులో మొదటి కేటగిరీలో వాణిజ్య సంస్థలు, హోటల్స్‌/రెస్టారెంట్‌/హాస్టల్స్‌/టిఫిన్‌ సెంటర్లు, రెండవ కేటగిరీలో ఫంక్షన్‌ హాల్స్‌, షాదిఖాన, మూడవ కేటగిరీలో చికెన్‌ సెంటర్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు, స్లాటర్‌హౌస్‌, నాల్గవ కేటగిరీలో వెజిటెబుల్‌ మార్కెట్లు/ వీక్లి మార్కెట్లు,/ సంతాలు/బజార్లు, ఐదవ కేటగిరీల్లో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లోని సంస్థలు ఉన్నాయి.
మూడు ‘చెత్త విభాగాలు’ ఇవే
తడి చెత్త: కూరగాయలు, పండ్లు తొక్క, మిగిలిన తిండి, గడువు తీరిన ఆహారం, మాంసం/ఎముకలు, గుడ్డు పెంకులు, టి బ్యాగులు, తోట వ్యవర్థాలు, ఫైబర్‌, పువ్వులు /దండలు.
పొడిచెత్త: ప్లాస్టిక్‌, బాక్సులు, టాఫీ ర్యాపర్లు, కాగితాలు, స్టేషనరీ పేకాట బోర్డులు, పిజ్జా డబ్బాలు, రబ్బర్‌, థర్మకోల్‌, కాస్మోటిక్స్‌.
ప్రమాదకర చెత్త: మందులు, పురుగుమందులు, పాతరంగు డబ్బాలు, జట్టురంగు డబ్బాలు, సినర్జీలు శానిటరీ చెత్త, ఉపయోగించిన కణజాలాలు, దోమల నివారిణి, ఈ

(గమనిక దీనిని బాక్స్‌గా వాడుకోగలరు)
============================================
యూజర్‌ చార్జీలు ఇవే (నెల వారీగా)
వ్యక్తిగత గృహాలు రూ. 20
అపార్ట్‌మెంట్స్‌ -రూ. 30
వాణిజ్య సంస్థలు (షాపులు, ఆహార ప్రాంతాలు,
దాబా/స్వీట్‌షాపులు, కాఫీ షాపులు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు) రూ. 500
గెస్ట్‌హౌస్‌ రూ 500
హాస్టల్స్‌ రూ. 750
హోటల్స్‌(అన్‌ స్టార్స్‌) రూ. 750
హోటల్స్‌ (త్రి స్టార్స్‌ వరకు ) రూ. 1500
హోటల్‌ (ఒవర్‌ త్రి స్టార్‌) రూ. 5000
ప్రభుత్వ విద్యా సంస్థలు రూ. 250
ప్రైవేటు విద్యాసంస్థలు రూ. 1000
వ్యక్తిగత కార్యాలయాలు రూ. 1000
కాంప్లెక్స్‌ బిల్డింగ్స్‌లోని ఆఫీసులు (ఒక్క యూనిట్‌కు) రూ. 1000
సినిమా హాల్‌ రూ. 1500
మల్టిప్లెక్స్‌ (నంబర్స్‌ తెర) రూ. 1500
మ్యారేజ్‌హాల్‌, ఫంక్షన్‌ హాల్‌, బాన్‌కిట్‌ హాల్స్‌
(20వేల చదరపు అడుగుల వరకు) రూ. 3000
(20వేల చదరపు అడుగులకు మించి) రూ. 5000
100 కిలలో బల్క్‌ చెత్త రూ. 3000
హెల్త్‌ కేర్‌ ఇనిస్టిట్యూషన్స్‌(బెడ్స్‌ లేనివి) రూ. 1,000
హెల్త్‌ కేర్‌ ఇనిస్టిట్యూషన్స్‌ 50 బెడ్స్‌ వరకు రూ. 3,000
హెల్త్‌ కేర్‌ ఇనిస్టిట్యూషన్స్‌ 50 నుంచి 100 బెడ్స్‌ వరకు రూ 5,000
హెల్త్‌ కేర్‌ ఇనిస్టిట్యూషన్స్‌ 100 నుంచి 200ల బెడ్స్‌ వరకు రూ. 7,500
హెల్త్‌ కేర్‌ ఇనిస్టిట్యూషన్స్‌ 200లకు పైగా ఉన్న బెడ్స్‌ రూ.10,000

DO YOU LIKE THIS ARTICLE?