నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచించాలి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
ప్రజాపక్షం న్యూస్ నెట్వర్క్
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని నెట్టెంపాడు ప్రా జెక్టులో భాగమైన చిన్నోనిపల్లి రిజర్వాయిర్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి చిన్నోనిపల్లి రిజర్వాయిర్ కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి పట్టాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. జలశక్తి శాఖ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం తెలంగాణలో అనుమతులు లేని ప్రాజెక్టుల్లో నెట్టెంపాడు ఒకటని, అలాంటి ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన 45రోజులలో నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం, ఆయకట్టు లేని చిన్నోనిపల్లి రిజర్వాయిర్ నిర్మించడానికి తలపడటం ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించా రు. ఇప్పటికే గట్టు మండలంలో చిన్నోనిపల్లి రిజర్వాయిర్ లేకున్నా నాలుగు కాలువలు తాటికుంట నాగర్‌దొడ్డి, ముచ్చంపల్లి. గజ్జెలమ్మ గట్టు ద్వారా నీటి లభ్యతకు, ఆయకట్టుకు అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో చిన్నోనిపల్లె రిజర్వాయిర్ కోసం 2,456 ఎకరాల భూములను చిన్న, సన్న, మధ్య తరగతి రైతుల నుండి, అసైన్డ్ రైతుల నుంచి సేకరించి రిజర్వాయిర్ కట్టాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. ఈ రిజర్వాయర్‌ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారని, జెసిబితో పనులను మొదలుపెడితే రైతులు అడ్డుకున్నారన్నారు. రిజర్వాయర్‌ను శనివారం పశ్య పద్మ సందర్శించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం గద్వాల జిల్లా కార్యదర్శి, చిన్నోనిపల్లి రిజర్వాయిర్ రద్దు కోసం ఏర్పడిన ఐక్య ఉద్యమ ప్రధాన కార్యదర్శి గోపాల్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఐక్య ఉద్యమ అధ్యక్షుడు రామచంద్రంగౌడ్, ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు వి.సాయిప్రసాద్ శాస్త్రి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి నర్సింహులు, భాదిత రైతులు నసీరుద్దీన్, సుధీర్ గౌడ్, వీరశేఖర్‌గౌడ్ తదితరులు మాట్లాడారు. నెట్టెంపాడుతో పాటు ఇతర ఆరు ప్రాజెక్టులకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) కేంద్ర జలశక్తికి శాఖకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పశ్య పద్మ విమర్శించారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న చిన్నోనిపల్లి రిజర్వాయిర్‌కు సంబంధించి సేకరించిన భూములలో రాష్ట్ర ప్రభుత్వాలు 17 సంవత్సరాల కాలంలో నిర్మాణం పూర్తి చేయలేక పోయాయని, భూసేకరణ, పునరావాస చట్టం లోని సెక్షన్ 24లోని ఉప నిబంధన 2 ప్రకారం సేకరించిన భూములను ఐదేళ్లలోపు భౌతికంగా స్వాధీనం చేసుకోలేకపోతే భూసేకరణ ప్రక్రియ రద్దయినట్లుగా పరిగణింపబడుతుందని ఆమె స్పష్టం చేశారు. చిన్నోనిపల్లి రిజర్వాయిర్ కోసం సేకరించిన భూములలో 2005 నుండి నేటి వరకు రైతులు సాగు చేసుకుంటున్నారని, సాగు చేసుకుంటున్న భూములకు తిరిగి పట్టాలు ఇవ్వాలన్నారు.
చిన్నోనిపల్లి రిజర్వాయిర్ నిర్వాసితులకు భూ పట్టాలివ్వాలి
RELATED ARTICLES