చలో రాష్ట్రపతి భవన్‌

జెఎన్‌యూ విద్యార్థుల భారీ ర్యాలీ
అడ్డుకున్న పోలీసులు
అరెస్టులు.. ఉద్రిక్తత

న్యూఢిల్లీ: యూనివర్శిటీ క్యాంపస్‌లో హింసాకాండను నిరసిస్తూ రాష్ట్రపతి భవన్‌కు గురువారం ర్యాలీ నిర్వహించాలనుకున్న జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ(జెఎన్‌యూ) విద్యార్థులను పోలీసులు ఆపేశారు. తర్వాత వారిని నిర్బంధంలోకి తీసుకున్నారు.విద్యార్థుల ర్యాలీలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి,సిపిఐ(ఎం) నాయకురాలు బృందాకారత్‌, ఆర్‌జెడి నాయకులు మనోజ్‌ ఝా తదితరులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.
జెఎన్‌యు హింసాకాండ అధికారికంగా స్పాన్సర్‌ చేసింది : కాంగ్రెస్‌
జెఎన్‌యూలో ఆదివారం జరిగిన హింసాకాండపై వరిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఎం. జగదీశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ గురువారం డిమాండ్‌ చేసింది. హోం మంత్రి అమిత్‌ షా, మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్‌ ఫోఖరియాల్‌ నిశాంక్‌ ప్రోద్బలంతోనే హింసాకాండ జరిగినందున హింసాకాండకు పాల్పడినవారిని ఇంకా అరెస్టు చేయలేదని కాంగ్రెస్‌ ఆరోపించింది. పార్టీ ప్రధాన కేంద్రంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ ఆ హింసాకాండ ‘అధికారికంగా స్పాన్సర్‌ చేసిన గూండాయిజం’ అని పేర్కొన్నారు. ఆ హింసాకాండ హఠాత్తుగా జరిగిందేమీ కాదని, దానిని కొందరు చేయించారని, వారెవరో కూడా మాకు తెలుసు. ఈ ఘటనలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి, హోం శాఖ మంత్రికి హస్తం ఉందని నేను ఆరోపిస్తున్నాను. ఇది ప్రభుత్వమే అధికారికంగా స్పాన్సర్‌ చేసిన గూండాయిజం’ అని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. ‘ఘటన జరిగి 72 గంటలు కూడా గడిచిపోయాయి. విధ్వంసకాండకు పాల్పడిందెవరో కూడా ఢిల్లీ పోలీసులకు తెలుసు. అయనప్పటికీ వారు నింపాదిగా వ్యవహరిస్తున్నారు. చాలా మామూలుగా వ్యవహరిస్తున్నారు. హింసాకాండకు పాల్పడినవారిని వెంటనే అరెస్టు చేయాలని మేము డిమాండ్‌ చేస్తున్నాం’ అని రమేశ్‌ చెప్పారు. ‘వైస్‌ ఛాన్సలర్‌గా జగదీశ్‌ కుమార్‌ ఉన్నంత వరకు పరిస్థితులు చకబడవు’ అని కూడా ఆయన ఆరోపించారు. ‘ప్రశాంతత నెలకొనాలంటే ఆయన రాజీనామాను ప్రభుత్వం కోరాలి’ అన్నారు. సోనియా గాంధీ నలుగురు సభ్యులతో ఏర్పాటుచేసిన ‘నిజనిర్ధారణ బృందం’ శుక్రవారంనాడు తన నివేదికను పార్టీ చీఫ్‌కు సమర్పించనుందని కూడా ఆయన తెలిపారు. ‘రాజకీయాలను ప్రభావితం చేసే’ విధానాలను మోడీ సర్కారు అనుసరిస్తోందని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. గత 42 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి స్థూలజాతీయోత్పత్తి రేటు(జిడిపి) పడిపోయిందన్నారు. తన ఆర్థిక విధానాలు విఫలమయ్యాయన్న విషయాన్ని మోడీ అంగీకరించాలన్నారు. ప్రధాని మోడీ మాజీ ప్రధాని డా. మన్మోహ న్‌ సింగ్‌ను సంప్రదించాలని కూడా హితవు చెప్పారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సిపై, జెఎన్‌యూ క్యాంపస్‌లో జరిగిన హింసాకాండపై, ఆర్థిక స్థితిపై పార్టీ ఉన్నత వేదిక… కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ శనివారం చర్చిస్తుందని కూడా జైరామ్‌ రమేశ్‌ తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?