చర్చలు జరిగేనా? సమస్యలు తీరేనా?

నేటి నుంచి రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు
పలు బిల్లుల ఆమోదంపైనే మోడీ సర్కారు దృష్టి
న్యూఢిల్లీ: రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, పలు సమస్యలపై చర్చలు జరగడం అనుమానంగానే కనిపిస్తున్నది. మొదటి విడత సమావేశాల మాదిరిగానే చర్చలకు అనుమతివ్వకుండానే నామమాత్రంగా ముగించడానికి కేంద్ర సర్కారు ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. జనవరి 29న మొదలైన తొలివిడత బడ్జెట్‌ సమావేశాలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంతో మొదలయ్యాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని సిపిఐ, సిపిఎంసహా 20 ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా బహిష్కరించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనలు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు వంటి పలు కీలక సమస్యలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టగా, మోడీ ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. ఈసారి నెల రోజుల పాటు జరగనున్న రెండో విడత సమావేశాల్లోనైనా రైతులు, ప్రజా సమస్యలు చర్చకు వచ్చే అవకాశం లేకపోవచ్చని అంటున్నారు. వివిధ పన్ను ప్రతిపాదనలున్న ఆర్థిక బిల్లుతోపాటు, ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల కోసం వచ్చిన డిమాండ్లకు ఆమోదముద్ర వేయిచుకోవడమే ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఈ తప్పనిసరి ఎజెండాలతోపాటు ఇదే సెషన్‌లో ఆమోదించడానికి వివిధ బిల్లులను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఇందులో పెన్షన్‌ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార (సవరణ) బిల్లు, మౌలిక సదుపాయాలు, నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్‌, ఎలక్ట్రిసిటీ (సవరణ) బిల్లు, క్రిప్టోకరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫీషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు తదితరాలు ఉన్నాయి. ఏప్రిల్‌ 8న ముగిసే ఈ రెండో విడత బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదింప చేసుకోవాలన్నది ప్రభుత్వ ధ్యేయం.
కీలక నేతలు దూరం..
పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగున్న నేపథ్యంలో, సోమవారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్‌ సెషన్స్‌కు కీలక నీతలు దూరమవుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపుగా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఐదు అసెంబ్లీలకు జరిగన ఎన్నికలపై దృష్టి సారించిన సమయంలోనే జరగుతుండడంతో రెండో విడత పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మార్చి-, ఏప్రిల్‌ నెలల్లో జరిగే ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా స్వీకరించాయి. దీనితో ఆయా పార్టీల అగ్ర నేతలు పార్లమెంటు సమావేశాలకు హాజరుకావడం కష్టమేనన్న వాదన వినిపిస్తున్నది. అదే జరగితే, బిల్లులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమోదింప చేసుకోవాలన్న ప్రభుత్వ లక్ష్యం సులభంగానే నెరవేరుతుంది. మొత్తం మీద ఈసారి బడ్జెట్‌ సమావేశాల తీరుతెన్నులపై ఉత్కంఠ నెలకొంది.

DO YOU LIKE THIS ARTICLE?