HomeNewsచరన్‌లో స్పేస్‌క్రాఫ్ట్‌కు అతిథి మర్యాదలు

చరన్‌లో స్పేస్‌క్రాఫ్ట్‌కు అతిథి మర్యాదలు

ఇంధన భర్తీ కేంద్రంగా ప్లూటో చందమామ
నాక్స్‌విల్లే: ప్రస్తుతం సౌర వ్యవస్థలో 8 గ్రహాలు వున్నాయి. ప్లూటోను గ్రహంగా గుర్తించలేదు. ఈ ప్లూటోను మరగుజ్జు గ్రహంగా పరిగణిస్తున్నారు. ప్లూటోకు స్వంత కక్ష్య లేనందునే దాన్ని గ్రహంగా గుర్తించలేదు. ఈ మరగుజ్జు గ్రహానికి ఉపగ్రహం కూడా వుంది. ఈ చందమామ కూడా ప్లూటో కక్ష్యలోనే తిరుగుతుంది. ఇంకా పలు ఆస్టరాయిడ్స్‌, ఇతర శకలాలు… ఇలా చాలావరకు ఇదే కక్ష్యలో తిరుగుతున్నాయి. ప్లూటోకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి గురుత్వాకర్షణ శక్తితోపాటు స్వంత కక్ష్య లేదన్నది శాస్త్రవేత్తల వాదన. అయితే ప్లూటోకు చెందిన అతిపెద్ద చందమామ (ఉపగ్రహం) చరన్‌ మాత్రం చాలా శక్తివంతమైన ఉపగ్రహంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంధనాన్ని పొదుపు చేసే గ్రావిటేషన్‌ బూస్ట్‌ కోసం చరన్‌ను ఉపయోగించుకునే అవకాశం వుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ప్లూటో పూర్తిస్థాయి గ్రహం కాకపోయినప్పటికీ ప్లూటో వ్యవస్థపై శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో అధ్యయనం చేపట్టారు. మన సౌరవ్యవస్థలో అత్యంత కీలకమైన చందమామగా చరన్‌ను పరిగణిస్తున్నారు. ఇదొక మంచు ప్రపంచం. చరన్‌ తన గురుత్వాకర్షణ శక్తితో మనం పంపించే ఒక స్పేస్‌క్రాఫ్ట్‌కు ఆతిథ్యమివ్వడంతోపాటు దాన్ని క్యూపర్‌బెల్ట్‌లోకి నిరభ్యంతరంగా పంపించగలదని ఖగోళ శాస్త్రవేత్త అలెన్‌ స్టెర్న్‌ తెలిపారు. అంతరిక్షంలో ప్రయాణించే స్పేస్‌క్రాఫ్ట్‌లను నిర్ణీత వ్యవధికాలపరిధిలో ప్రయోగిస్తున్నారు. అయితే అవి తమ గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా పనిచేస్తూనే వున్నాయి. వాటికి ఇంధనం సరఫరా చేయగలిగితే అవి మరింత కాలం పనిచేయగలవు. తద్వారా తమ శాస్త్రీయ కార్యకలాపాలను నిర్వహించగలవు. అందుకే అంతరిక్షంలో స్పేస్‌క్రాఫ్ట్‌ల ఇంధన అవసరాలను తీర్చేందుకు ప్రత్యామ్నాయ విధానాలపై అలెన్‌ స్టెర్న్‌, అతని సహచరుల బృందం వివిధ కోణాల నుంచి పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంధన అవసరాలను తీర్చేలా ప్లూటోకు చెందిన ఆర్బిటల్‌ మిషన్‌ను విస్తరించేందుకు గల అవకాశాలపై సౌత్‌వెస్ట్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఈ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేసిన మీదటే ప్లూటో అతిపెద్ద చందమామ చరన్‌ గురుత్వాకర్షణ శక్తిని గుర్తించింది. టెన్నెస్సీలోని నాక్స్‌విల్లేలో గల అమెరికన్‌ ఆస్ట్రనామికల్‌ సొసైటీ వార్షిక డివిజన్‌ ఫర్‌ ప్లానెటరీ సైన్సెస్‌ సదస్సులో దీనికి సంబంధించిన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. 2015 జులైలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన న్యూహారిజాన్స్‌ అంతరిక్ష వాహకనౌక ప్లూటోకి చెందిన పలు రహస్యాలను ఛేదించింది. ప్రస్తుతం స్టెర్న్‌ బృందం పరిశోధనలు కూడా ఆ డేటా ఆధారంగానే సాగాయి. శనిగ్రహానికి చెందిన చందమామ టైటాన్‌ కన్నా చరన్‌ ఉపయుక్తంగా వుండగలదని వారన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments