ప్రధాని నరేంద్రమోడీకి సోనియాగాంధీ లేఖ
న్యూఢిల్లీ: చుక్కలను తాకుతున్న చమురు ధరలను తగ్గించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రానికి సూచించారు. ఇంధనం, గ్యాస్ ధరల పెరుగుదల గురించి సోనియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆదివారం లేఖ రాశారు. ప్రజల కష్టాలను ప్రభు త్వం లాభార్జనకు మార్గంగా చేసుకుందని ఇందులో ఆమె ఆక్షేపించారు. స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి) దారుణంగా పతనమవుతున్న దశలో ఇంధనం ధరలు అదుపులేకుండా పెరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. దిమ్మతిరిగేలా ఉన్న ఇంధనం ధరలతో ప్రతి ఒక్కరూ యాతన అనుభవిస్తున్నారని, ఉద్యోగాలు, వేతనాలు, కుటుంబ ఆదాయం క్రమం గా తగ్గుతూ వస్తున్నాయని, మధ్యతరగతివారు, పేదలు జీవితం కోసం పోరాటం చేయాల్సి వస్తోందని సోనియా లేఖలో పేర్కొన్నారు. వీటికి ద్రవ్యోల్బణం తోడవడంతో అన్ని నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆమె అన్నారు. ప్రజలు కడగండ్ల పాలవుతున్న దుస్థితిలో ప్రభుత్వం లాభార్జనకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పె ట్రోల్, డీజిల్ ధరలు భరించ లేని స్థితికి చేరుకున్నాయని ఎద్దేవా చేశారు. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మితంగానే ఉన్నప్పటికీ దేశీయంగా ధరలు పెరగడం ప్రజలను కలవరపెడుతోందని సోనియా అన్నారు. యుపిఎ అధికారంలో ఉన్నప్పటితో పోలిస్తే ముడి చమురు దాదాపు సగం ధరకే లభిస్తోందని, అయినప్పటికీ ప్రభుత్వం ధరలు పెంచడం సిగ్గుపడాల్సిన విషయం అని సోనియా విమర్శించారు. కాగా, ఏడేళ్లుగా అధికారంలో ఉంటూ, ఆర్థిక నిర్వహణ సరిగ్గా చేయలేక పాత ప్రభుత్వాలను నిందించడం బాధాకరం అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. చమురు ధరల పెరుగుదలకు తోడు, 2020లో దేశీయంగా ముడి చమురు ఉత్పత్తి 18 ఏళ్ల కనిష్ఠానికి చేరుకుందని ఆరోపించారు. తమ బరువును తగ్గిస్తారని ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారని, అయితే ప్రస్తుతం దానికి భిన్నంగా నడుస్తోందని సోనియా ఎద్దేవా చేశారు. అందుకని చమురు ధరలను తగ్గించి మధ్యతరగతివారు, వేతనజీవులు, రైతులు, పేదలు, సామాన్యులకు ప్రయోజనం కలిగించాలని ప్రభుత్వానికి సూచించారు. సాకులు వెతకకుండా ప్రభుత్వం పరిష్కారాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఇదిలా ఉంటే చమురు ధరలను భరించగలిగే స్థాయికి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రయత్నించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం పేర్కొనడం గమనార్హం.
చమురు ధరలు తగ్గించండి
RELATED ARTICLES