చచ్చిన వైరస్‌ మళ్లీ బతికింది!

దక్షిణ కొరియాలో కరోనా కలకలం
కోలుకున్న వ్యక్తులకు   తిరిగి పాజిటివ్‌

సియోల్‌: కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తి హమ్మయ్యా అనుకున్నాడు. అంతలోపే మళ్లీ అతడికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ వైరస్‌ సోకుతుందా? అప్పటికే శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయా? వైరస్‌ను నిద్రాణ స్థితిలోనే ఉంచుతాయా? ఇతరులకు సోకినా ప్రమాదం ఉండదా?  ప్రస్తుతం వైద్యులు, పరిశోధకులకు ఇలాంటి సందేహాలెన్నో ఉన్నాయి. అయితే దక్షిణ కొరియాలో కరోనా  నయమైందని భావించిన 91 మందికి పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా నయమైన వారికి వైరస్‌ ఇతరుల నుంచి సోకుండా శరీరంలోనే తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నామని కొరియా వ్యాధుల నియంత్రణ (కెసిడిసి) సంస్థ డైరెక్టర్‌ జియాంగ్‌ ఇయున్‌ క్యెయాంగ్‌ అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థంకావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే కరోనా నియంత్రణకు వైద్యులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని వివరించారు. ఒక్కసారి కొవిడ్‌ సోకినవారిలో యాంటీబాడీలు పెరిగి సంబంధిత రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఇంతకాలం భావించారు. వైరస్‌ మళ్లీ దాడిచేస్తుండటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. దక్షిణ కొరియాలో రెండోసారి కరోనా సోకిన వారి సంఖ్య సోమవారం 51గా ఉండగా శనివారం 91కి చేరుకుంది. ఆ దేశంలో దాదాపుగా 7000 మంది కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. రెండో సారి సోకినవారి సంఖ్య పెరుగుతోంది. 91 అనేది ఇప్పుడే మొదలైందనడానికి నిదర్శనం అని కొరియన్‌ యూనివర్సిటీ గురో ఆస్పత్రి ప్రొఫెసర్‌ కిమ్‌ వూ జూ అన్నారు. బహుశా వైరస్‌ తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నానని తెలిపారు. నమూనాల పరీక్షల్లో కొందరి ఫలితాలు తప్పుగా వచ్చాయేమోనన్న అనుమానాలూ ఉన్నాయి. కోలుకున్నవారిలోనూ వైరస్‌ అవశేషాలు ఉంటాయని పాజిటివ్‌ వచ్చినప్పటికీ ఇతరులకు సంక్రమించకపోవచ్చని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అంత ప్రమాదకరం కాకపోవచ్చని అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ అన్ని విషయాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?