HomeNewsBreaking News‘చంద్రయాన్‌' వీరులకుమిగిలింది ప్రశంసలే

‘చంద్రయాన్‌’ వీరులకుమిగిలింది ప్రశంసలే

జీతాల కోసం ఎదురుచూపు.. ప్రమోషన్లు అసలే లేవు..
బిజెపి సర్కారుపై కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆగ్రహం
న్యూఢిల్లీ:
చంద్రయాన్‌ 3 మిషన్‌ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ఎంతో మంది కి ప్రశంసలు తప్ప ఎలాంటి మేలు జరగలేదని పది కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇండిపెండెంట్‌ సెక్టోరల్‌ ఫెడరేషన్స్‌, అసోసియేషన్స్‌తో కలిసి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈ ప్రయోగాన్ని విజవంతం చేసిన వాస్త్రవేత్తలను, వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులను అభినందించింది. ఈ ప్రాజెక్టు కోసం వేలాది మంది సర్వశక్తులు కేంద్రీకరించి కృషి చేశారని పేర్కొంది. అయితే, వారికి ఎలాంటి న్యాయం జరగడం లేదని ఆరోపించింది. చంద్రయాన్‌ ప్రయోగంలో కీలకంగా వ్యవహరించిన రాంచీ (జార్ఖండ్‌)లోని హెవీ ఇంజనీరింగ్‌ కార్పొరేషన్‌ (హెచ్‌ఇసి)కి చెందిన వేలాది మంది ఇంజనీర్లు, ఉద్యోగులకు 17 నెలలుగా జీతాలు లేకపోవడం విచారకమని కార్మిక సంఘాల ఐక్య వేదిక ప్రకటనలో వ్యాఖ్యానించింది. మొబైల్‌ లాంచ్‌ ప్యాడ్‌ను, ఇతర ముఖ్యమైన పరికరాలను తయారు చేసిన హెచ్‌ఇసి పట్ల కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని మండిపడింది. ఈ ప్రయోగంలో ప్రసార సాధనాలు కీలక భూమిక పోషిస్తాయని, ఈ బాధ్యతను మరో ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ సమర్థంగా నిర్వర్తించిందని గుర్తుచేసింది. ఎంతో ఉత్తమ సేవలు అందిస్తున్న బిఎస్‌ఎన్‌ఎల్‌ను దెబ్బతీయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఐక్య వేదిక ఆరోపించింది. చంద్రయాన్‌ 3 మిషన్‌ మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలే నిర్వహించాయని గుర్తుచేసింది. దీర్ఘకాల ప్రయోజనాలను ఉద్దేశించి ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పడ్డాయని, తక్షణ లాభాల కోసం అర్రులు చాచే ప్రైవేటు రంగం ఇలాంటి పెట్టుబడులకు సిద్ధంగా ఉండవని వ్యాఖ్యానించింది. కొవిడ్‌ మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో, నిస్వార్థ సేవలు అందించిన ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు జీతాలు పెరగలేదని, ఇప్పుడు హెచ్‌ఇసి ఉద్యోగుల పరిస్థితి కూడా అదే విధంగా ఉందని పేర్కొంది. అప్పట్లోనూ ‘ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌’ అంటూ ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రశంసించారని, ఇప్పుడు చంద్రయాన్‌ 3 వీరులకు కూడా ప్రశంసలు మాఅతమే మిగిలాయని వ్యాఖ్యానించింది. దేశానికి ప్రభుత్వ రంగ సంస్థలే వెన్నుముక అనే వాస్తవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించాలని ఐక్య వేదిక డిమాండ్‌ చేసింది. పిల్లల ఆరోగ్యం నుంచి అంతరిక్షం వరకూ ప్రభుత్వ రంగ సంస్థలు విశేష కృషి చేస్తున్నాయని, కానీ, వటిలో పని చేస్తున్న ఉద్యోగులు ఆకలితో అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కోట్లాది రూపాయలు దోచుకొని, వాటిని నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హెచ్‌ఇసి ఉద్యోగులకు జీతాల బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. అదే విధంగా ఇస్రోలోని ఇంజనీర్లు, విజ్ఞాన శాస్త్ర రంగంలో పని చేస్తున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments