HomeNewsAndhra pradeshచంద్రబాబు అరెస్టు

చంద్రబాబు అరెస్టు

అడ్డుకున్న టిడిపి శ్రేణులు
భారీగా పోలీసుల మోహరింపు
స్కిల్‌ డెవలప్‌మెంటు స్కాంలో నిందితుడిగా సిఐడి వెల్లడి
నంద్యాల/విజయవాడ
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును సిబిసిఐడి పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నంద్యాలలో అరెస్టు చేసిన చంద్రబాబును రోడ్డుమార్గం ద్వారా సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి కుంచనపల్లిలోని సిట్‌ కార్యాలయానికి తరలించారు. కొన్నిగంటల పాటు అక్కడే ఉంచి ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్‌కే ఫంక్షన్‌ హాలు వద్ద రాత్రంతా హైడ్రామా చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్టును అడ్డుకోవడానికి టిడిపి నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, టిడిపి శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. ఉద్రిక్తల నడుమ
ఉదయం ఆరు గంటలకు చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుంభకోణానికి సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని, రూ.371 కోట్ల కుంభకోణంలో చంద్రబాబుదే కీలకపాత్ర అని సిఐడి అధికారులు తెలిపారు. ఈ కేసులోనే చంద్రబాబును అరెస్టు చేశారు. సిఆర్‌పిసి సెక్షన్‌ 50(1) కింద సిఐడి డిఎస్‌పి ధనుంజయుడు చంద్రబాబుకు నోటీసు అందజేశారు. అవినీతి నిరోధక చట్టం1988 కింద చంద్రబాబుపై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌విత్‌ 34, 37 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబు అరెస్టుకు ముందు పోలీసులు పెద్దఎత్తున నంద్యాల చేరుకున్నారు. ఫంక్షన్‌ హాలుకు కిలోమీటరు పరిధిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి శనివారం వేకువజామున నాలుగు గంటల వరకు ఈ తతంగం సాగింది. చంద్రబాబు అరెస్టు కోసం అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి 900 మంది పోలీసులను అర్ధరాత్రి దాటాక నంద్యాలకు తరలించారు. డీఐజీ రఘురామిరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్‌ రెడ్డి, ఏఎస్పీ వెంకటరాముడు అధ్వర్యంలో బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఫంక్షన్‌ హాల్‌ చుట్టుపక్కల కిలో మీటరు మేర ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టిడిపి నేతలు కాలువ శ్రీనివాసులు, ఎన్‌ఎండీ ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు పోలీసులను అడ్డుకున్నారు. చంద్రబాబుతో మాట్లాడాలని పోలీసులు తెలుపుగా…. ఆయన నిద్రలో ఉన్నారని నాయకులు చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబుతో మాట్లాడాల్సిన అవసరం ఏముందని, నిద్ర లేచాక చంద్రబాబుతో మాట్లాడాలని వాగ్వివాదానికి దిగారు. చంద్రబాబును తీసుకెళ్లకుండా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఫంక్షన్‌ హాల్‌ గేటు వద్ద అడ్డంగా కూర్చున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మాజీమంత్రి భూమా అఖిలప్రియ, భూమా జగత్‌ విఖ్యాతరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దనరెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, బీవీ నాగేశ్వరరెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డి, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బీటీ నాయుడు, మల్లెల రాజశేఖర్‌, టీడీపీ నాయకులు ఏవీ సుబ్బారెడ్డి, ఎన్‌ఎండీ ఫిరోజ్‌ తదితర నాయకులను అరెస్ట్‌ చేసి బండి ఆత్మకూరు, మహానంది పోలీసుస్టేషన్‌లకు తరలించారు. ఆరు గంటల సమయంలో చంద్రబాబు బస్సు నుంచి దిగి వచ్చి సీఐడీ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులకు, చంద్రబాబుకు వాగ్వివాదం జరిగింది. న్యాయవాదులు రామచంద్రరావు, తులసిరెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాధానం చెప్పలేదు. చివరకు నోటీసులిచ్చి చంద్రబాబును అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సీఐడీ కార్యాలయానికి బయలుదేరడానికి ముందు చంద్రబాబుకు నంద్యాలలో వైద్యపరీక్షలు నిర్వహించారు. ఓర్వకల్లు నుండి ప్రత్యేక హెలిక్యాప్టర్‌ లేదా ప్రత్యేక విమానం ద్వారా విజయవాడ వెళదామని అధికారులు చెప్పినా…తన కాన్యాయ్‌లోనే వస్తానని చంద్రబాబు పట్టుబట్టారు. చివరకు చంద్రబాబును 8 గంటల సమయంలో ఆయన కాన్వాయ్‌లో తీసుకెళ్లారు.
అరెస్టు ఎలా చేస్తారు: చంద్రబాబు
‘నేను ఏ తప్పు చేయలేదు. ఏదో ఓ కేసు బనాయించి నన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే జగన్‌ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోంది. ప్రభుత్వం అణచివేత విధానాలకు పాల్పడుతోంది. ఎందుకు అరెస్టు చేస్తున్నారో పోలీసులు చెప్పడం లేదు. అర్ధరాత్రి ఈ హంగామా ఏమిటి? ఎన్‌ఎస్‌జీ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రిని వారెంట్‌ లేకుండా అరెస్టు చేస్తానని ఎలా అంటారు? ప్రజా సమస్యలపై పోరాడుతుంటే ఉద్దేశపూర్వకంగా నన్ను అడ్డుకోవడానికి అరెస్టు చేశారు. ఈ అరెస్టులు నన్ను ఆపలేవు. నాకు కోర్టులపై నమ్మకం ఉంది. కోర్టులోనే తెల్చుకుంటా. పార్టీ కార్యకర్తలు, ప్రజలు సమయమనం పాటించాలి’ అని చంద్రబాబు అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments