గెలుపు మాదే!

తిరుగుబాటును అణచివేశాం!
అమెరికా ఆగడాలను తిప్పికొట్టాం
ప్రకటించిన వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో

అంకారా: వెనిజులా దేశం ఇటీవల తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడింది. ప్రతిపక్ష నేత యువాన్‌ గ్వాయిడో ఆధ్వర్యంలో జరిగిన తిరుగుబాటును పూర్తిగా అణచివేశామని ఆ దేశాధ్యక్షుడు నికొలస్‌ మదురో ప్రకటించారు. అమెరికా తదితర దేశాల జోక్యాన్ని పూర్తిస్థాయిలో తిప్పికొట్టినట్లు వెల్లడించారు. విజయం సాధించామని తెలిపారు. బుధవారంనాడు అధికారిక టీవీలో చేసిన ఒక ప్రసంగంలో మదురో ఈ విషయాన్ని ధృవీకరించారు. మంగళవారం తిరుగుబాటుదారులకు, మదురో సేనకు జరిగిన ఆఖరి పోరాటంలో జాతీయ రక్షకదళం ఏకపక్ష విజయం సాధించింది. వందలాది మంది తిరుగుబాటుదారులు తీవ్రంగా గాయపడి, పలాయనం చిత్తగించారు. యువాన్‌ గ్వాయిడో కొంతమంది జనాన్ని కూడగట్టి, అమెరికా, బ్రిటన్‌, మరికొన్ని లాటిన్‌ అమెరికా దేశాల సహకారంతో తిరుగుబాటుకు దిగిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోంది. ప్రజలు మాత్రం పెద్దసంఖ్యలో అధ్యక్షుడు నికొలస్‌ మదురోకు మద్దతుగా నిలవగా, తిరుగుబాటు క్రమంలో గ్వాయిడో వెనిజులా సైనిక సహకారం కోరారు. అయితే సైన్యం అందుకు అసమ్మతి తెలియజేసింది. అయినప్పటికీ, అమెరికా పెద్ద ఎత్తున నిధులు అందజేసి, తిరుగుబాటుకు ఆజ్యం పోసింది. అయితే, రష్యా, చైనా, క్యూబా వంటి 50కి పైగా దేశాలు మదురోకు మద్దతుగా నిలిచాయి. పైగా సైన్యం చేజారకుండా మదురో జాగ్రత్తపడ్డారు. దీంతో అమెరికా ఎత్తుగడలు ఫలించలేదు. మేడే సందర్భంగా మదురో చేసిన ప్రసంగం సందర్భంలో అగ్రసైనిక దళాధిపతులు కూడా ఆయనతోపాటు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా అప్రమత్తం కావాల్సిన తరుణం ఆసన్నమైందని, తిరుగుబాట్లు ఇక దేశంలో లేనట్లేనని మదురో స్పష్టంచేశారు. అమెరికాపై ఆయన ధ్వజమెత్తారు. తనకు వ్యతిరేకంగా అమెరికా కుట్ర పన్నిందని ఆరోపించారు. తాను క్యూబాకు వెళ్లిపోవడానికి ప్రత్యేక విమానం సిద్ధం చేసుకున్నట్లు అమెరికా చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు.

DO YOU LIKE THIS ARTICLE?