11 మంది భక్తులు మృతి
80 మందికి అస్వస్థత
బెంగుళూరు : ఆలయంలో కలుషిత ప్రసాదం జనాన్ని కాటేసింది. కర్నాటకలో ఒక ఆలయంలో పంపిణీ చేసిన కలుషిత ప్రసాదం తిని కనీసం 11 మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. మరో 80 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కర్నాటక రాష్ట్రంలోని చామరాజ్నగర్ జిల్లా సులవాదీ గ్రామంలో గల ఒక దేవాలయంలో ఈ దుర్ఘటన జరిగింది. మైసూర్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా వుందని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. “రామపురలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బాలుడు చనిపోయాడు. అలాగే కమగేరీ, కోలెగల్ ప్రభుత్వాసుపత్రుల్లో ఇద్దరు చొప్పున మరణించారు. కెపి ఆసుపత్రిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కెఆర్హెచ్ ఆసుపత్రిలో ఒకరు చనిపోయారు” అని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు సురేష్ శాస్త్రి తెలిపారు. ఈ దుర్ఘటన పట్ల కర్నాటక ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కుమారస్వామి హుటాహుటిన బెళగావి నుంచి ప్రత్యేక విమానంలో చామరాజ్‌నగర్‌కు చేరుకొని పరిస్థితి సమీక్షించారు. ఎంత వైద్యఖర్చయినా మిగతా ప్రాణనష్టం జరగకుండా చూడాలని సిఎం ఆదేశించారు. చామరాజ్‌నగర్‌లో అంబులెన్స్‌ల కొరత ఉన్న కారణంగా మైసూరు నుంచి 32 అంబులెన్స్‌లను తరలించినట్లు తెలిపారు. ఇదిలావుండగా, ఆలయ నిర్వహణకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేసి ఇంటరాగేషన్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కలుషిత ఆహారానికి చెందిన నమూనాలను సేకరించి, ల్యాబొరేటరీకి పంపించినట్లు తెలిపారు. మారమ్మ దేవాలయంలో శుక్రవారంనాడు ఒక ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగానే ప్రసాదం పంపిణీ చేశారు. ఓంశక్తి సాంప్రదాయాన్ని నమ్ముకున్న భక్తులే అధికంగా ఈ దైవకార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రసాదం తిన్న తర్వాత చాలామంది కడుపునొప్పి, వాంతులు మొదలయ్యాయి. దీంతో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు పరుగులు తీశారు. ప్రసాదంలో కిరోసిన్ వాసన వచ్చిందని భక్తులు చెపుతున్నట్లు పోలీసులు తెపారు.
గుడిలో ప్రసాదం కాటేసింది!
RELATED ARTICLES