HomeNewsBreaking Newsగిరిజనులను వనవాసీలను చేసిఅడవులకే పరిమితం చేస్తున్న బిజెపి

గిరిజనులను వనవాసీలను చేసిఅడవులకే పరిమితం చేస్తున్న బిజెపి


అటవీ భూములకు నిజమైన యజమానుల హోదా కల్పించడం లేదు : రాహుల్‌గాంధ

వయనాడ్‌ : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. ఆదివాసీలను వనవాసీలుగా పిలుస్తూ వారిని కేవలం అడవులకే బిజెపి పరిమితం చేయాలనుకుంటోందని మండిపడ్డారు. ఈ భూములకు నిజమైన యజమానుల హోదాను కల్పించడం లేదన్నారు. ఆదివాసీలను వనవాసీలుగా పిలవడం అంటే వారిని అనుమానించడమేనని, వారి అటవీ భూములను లాక్కుని పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలనుకుంటోందని ఆరోపించారు. వయనాడ్‌ జిల్లా మనంతవాడి ప్రాంతంలోని డాక్టర్‌ అంబేద్కర్‌ జిల్లా మెమోరియల్‌ కేన్సర్‌ సెంటర్‌లో హెచ్‌టి కనెక్షన్‌ను రాహుల్‌గాంధీ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజనులను వనవాసీలుగా బిజెపి పిలవడం వెనుక ఒక లాజిక్‌ ఉందన్నారు. యాజమాన్య హక్కులు నిరాకరించడం, అడువులు విడిచిపెట్టకుండా అక్కడే వారిని పరిమితం చేయడం వంటి ఉద్దేశాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆలోచనా విధానాన్ని కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించదన్నారు. వనవాసీలుగా పిలవడమంటే గిరిజన జాతుల సంప్రదాయాలను, చరిత్రను వక్రీకరించడమేనని, దేశంతో గిరిజనులకు ఉన్న సంబంధంపై దాడి జరపడమేనని చెప్పారు. ‘మాకు (కాంగ్రెస్‌) మీరు ఆదివాసీలే. మీరు ఈ భూమికి నిజమైన యజమానులు’ అని రాహుల్‌ చెప్పారు. దేశంలోని అందరికీ కల్పిస్తున్నట్టే ఆదివాసీలకు విద్య, ఉద్యోగాలు, వృత్తులు వంటి అన్ని అవకాశాలు కల్పించాలన్నారు. ఆదివాసీలకు ఈ ప్లానెట్‌లో అన్ని అవకాశాలు తెరిచి ఉండాలన్నారు. పర్యావరణం, పర్యావరణ పరిరక్షణ అనేది ఈరోజు ఫ్యాషన్‌గా మారుతోందని, ఆధునిక సొసైటీ పేరుతో
అడవులను తగులబెడుతున్నారని, కాలుష్యం సృష్టిస్తున్నారని విమర్శించారు. అయినప్పటికీ ఆదివాసీలు వేల సంవత్సరాలుగా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారని ప్రశంసించారు. ఆదివాసీలను చూసి అందరూ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.
కుటుంబ అనుబంధాలేంటో వాళ్లకేం తెలుసు?
‘బిజెపి, ఆరెస్సెస్‌లకు కుటుంబం అంటే తెలియదు. ఆ బంధాలు వాళ్లకు అర్థం కావు. మనమంతా ఓ కుటుంబంలా ఉండటం బిజెపికి నచ్చడం లేదు. మీతో నా బంధాన్ని దూరం చేసేందుకు వాళ్లు ఎంతగా ప్రయత్నిస్తే.. మన బంధాలు అంత దృఢమవుతాయన్న సంగతి వాళ్లకు తెలియదు. అనర్హత వేటు వేసి.. రాహుల్‌తో వయనాడ్‌ ప్రజలకున్న సంబంధాన్ని కత్తిరించాలనుకున్నారు. అది వాళ్లకు కలలో కూడా సాధ్యం కాదు” అని రాహుల్‌ అన్నారు.
ఎంపిలాడ్స్‌ నుంచి రూ.50 లక్షలు
కేన్సర్‌ సెంటర్‌లో కొత్త ఎలక్ట్రిసిటీ కనెక్షన్‌ వల్ల ఈ ప్రాంతంలో డాక్టర్లు, పేషెంట్లు తరచూ ఎదుర్కొంటున్న కరెంట్‌ కోతల సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. ఎంపిలాండ్స్‌ నిధి నుంచి రూ.50 లక్షలు ఖర్చుచేయడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. కాగా, రాహుల్‌ తన పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం కోజికోజ్‌ జిల్లాలోని కొడెంచెరిలో సెయింట్‌ జోసెష్‌ హైస్కూల్‌ ఆడిటోరియం వద్ద కమ్యూనిటీ డిసేబిలిటికీ మేనేజిమెంట్‌ సెంటర్‌ (సిడిఎంఎస్‌)కు శంకుస్థాపన చేశారు. రాత్రి 10.30 గంటలకు కాలికట్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అయితే రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌గాంధీ శనివారం కేరళకు విచ్చేశారు. తన పార్లమెంట్‌ సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తరువాత సొంత నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments