HomeNewsBreaking Newsగిరిజనాభివృద్ధికి రూ.47,258 కోట్లు ఖర్చు

గిరిజనాభివృద్ధికి రూ.47,258 కోట్లు ఖర్చు

మొత్తం రూ.75,450 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రజాపక్షం/హైదరాబాద్‌
గిరిజన అభివృద్ధి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రూ.75,450 కోట్లు కేటాయిస్తే, ఇప్పటి వర కు రూ.47,258 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. 3146 గ్రామ పంచాయతీల్లో రూ. 1,837.08 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టింది. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం రూ 300 కోట్లు ఎస్‌టిఎస్‌డిఎఫ్‌ కింద ప్రత్యేక నిధులను కేటాయించినట్టు ప్రభుత్వం తెలిపింది. గిరిజన అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను సమాచార, పౌర సం బంధాల శాఖ సోమవారం వెల్లడించింది. ఎస్‌టి ఆవాసాలకు బిటి రోడ్ల సౌకర్యం కల్పించి,1,682 ఆవాసాలలో రూ.1,276 కోట్లతో బిటి రోడ్లను అభివృద్ధి చేశారు. ఈ సంవత్సరం 2090 గిరిజన పల్లెల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు కేటాయించి, అత్యంత వెనకబడిన ఆదివాసీ తెగలు నివసిస్తున్న గ్రామాల్లో అంతర్గత సిసి రోడ్లు మురుగునీటి పారుదల వ్యవస్థల నిర్మాణానికి ప్రత్యేక నిధుల కింద రూ.133 కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఎస్‌టి సామాజిక వర్గాల నివాస గృహాలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తుండగా, మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆదివాసీ గిరిజనుల వ్యవసాయానికి కావాల్సిన మెరుగైన విద్యుత్‌ సరఫరా కోసం మూడు ఫేజ్‌ లైన్లను అభివృద్ధి చేశామని, ఇందుకు రూ. 221 కోట్లను ఖర్చు చేశామని ప్రభుత్వం పేర్కొంది. గిరిజనులు విద్యా రంగంలో ముందుండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేకంగా 92 గురుకుల విద్యాలయాలను నెలకొల్పింది. ఇందులో రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలు, ఫైన్‌ ఆర్ట్‌ కాలేజీలు, లా కాలేజీ, సైనిక్‌ స్కూల్‌, కాలేజీ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఉన్నాయి. గురుకులాల్లో మెరుగైన శిక్షణ పొందిన 918 మంది ఎస్‌టి విద్యార్థులకు ఐఐటి, ఎన్‌ఐటి, ఐఐఐటి, ఇతర వృత్తి పరమైన కోర్సులలో ప్రవేశాలు సాధించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విదేశాల్లో ఎస్‌టి విద్యార్థుల ఉన్నత చదువుల కోసం అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యా నిధి కింద ప్రతి విద్యార్థికి రూ. 20 లక్షల చొప్పున రూ 33.49 కోట్లతో 237 మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ఆదివాసీ యోధుడు కొమరం భీమ్‌, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహారాజ్‌ల జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, దక్షిణాది కుంభమేళాగా పేరు గాంచిన ఆసియాలోనే అతి పెద్దదైన సమ్మక్క సారలమ్మ జాతరతో పాటు నాగోబా, జంగుబాయి, బరంపూర్‌ జాతర, ఎరుకల నాంచారమ్మ జాతర, గాందరి మైసమ్మ వంటి జాతరలను నిర్వహిస్తున్నదని ప్రభుత్వం తెలిపింది. ఇందుకు ప్రభుత్వం రూ.354 కోట్లు ఖర్చు చేసిందన్నారు. హైదరాబాద్‌లో ఆదివాసీ బంజారాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా బంజారాహిల్స్‌లో సుమారు రూ.50 కోట్లు ఖర్చుచేసి కొమురంభీమ్‌ ఆదివాసీ భవనం, సేవాలాల్‌ బంజారా భవనాన్ని నిర్మించింది. రైతుబంధు పథకంలో భాగంగా ఎస్‌టి సామాజిక వర్గానికి చెందిన 8,23,780 మంది రైతులకు రూ.7,354 కోట్ల పంట పెట్టుబడి సాయాన్ని అందించింది. రైతుబీమా కింద 4,93,720 మంది ఎస్‌టి రైతులకు ఉచిత బీమా సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పటి వరకు రూ.611 కోట్ల ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించినట్టు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది.ఆసరా పింఛన్‌ ద్వారా 3,75,316 మంది గిరిజనులకు రూ.4,286 కోట్ల మొత్తాన్ని అందించగా, కళ్యాణ లక్ష్మీ పథకం కింద 1,36,730 మంది గిరిజన ఆడబిడ్డల వివాహ ఖర్చు నిమిత్తం రూ. 1,126.61 కోట్లను ఆర్థిక సహాయంగా అందజేసినట్టు ప్రభుత్వం తెలిపింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments