HomeNewsAndhra pradeshగవర్నర్‌ వ్యవస్థ… నిరర్థకం… నిరుపయోగం

గవర్నర్‌ వ్యవస్థ… నిరర్థకం… నిరుపయోగం

రద్దు చేయాలని సిపిఐ 24వ జాతీయ మహాసభ తీర్మానం
బొమ్మగాని కిరణ్‌ కుమార్‌
కామ్రేడ్‌ గురుదాస్‌ దాస్‌ గుప్తా నగర్‌ / విజయవాడ
నిరర్థకమైన, నిరూపయోగమైన, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధంగా సాగుతున్న గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని సిపిఐ 24వ జాతీయ మహాసభ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాజకీయ తీర్మానానికి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రతిపాదించిన సవరణను ప్రతినిధులు ఆమోదించారు. మన రాజ్యాంగ సృష్టికర్త లు ఆశించిన దానికి భిన్నంగా స్వతంత్ర భారతదేశంలో గవర్నర్‌ వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తూ, వ్యతిరేక దృక్పథంలో నడుస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకున్న పాలకులు దారి తప్పిన సమయంలో సరైన దారి లో పెట్టేందుకు రాజ్యాంగ నిర్మాతలు గవర్నర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. దానికి భిన్నంగా ప్రస్తుతం గవర్నర్‌లే రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని, ప్రజలచే ఎన్నుకోబడిన పాలకులనే కేంద్ర కనుసన్నలలో మెలిగి, దొడ్డిదారిని, ప్రత్యక్షంగా కూలదోస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర పాలకులు సైతం వారికి అవసరమైన నాయకులకు రాజకీయ పునరావాసం కల్పించేందుకు గవర్నర్‌గా నియమిస్తున్నారన్నారు. దీంతో గవర్నర్‌లు రాజనీతిజ్ఞులుగా స్వతంత్రంగా వ్యవహరించకుండా రాజకీయ నాయకుల కంటే అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, గవర్నర్‌ కార్యాలయాలను అసాంఘిక కార్యకలాపాల కేంద్రంగా చేస్తున్నారని, స్వతంత్రంగా ఉండాల్సిన గవర్నర్‌ వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్నారని కూనంనేని వివరించారు. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్‌ వ్యవస్థ కారణంగా ఒక్క మంచి జరిగినట్లు ఆధారాలు లేవని, సర్కారియా కమిషన్‌ కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. అందుకే గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని రాజకీయ తీర్మానానికి సవరణ ప్రతిపాదించినట్లు తెలిపారు.
పునర్విభజన చట్ట హామీలను అమలు చేయాలని తీర్మానం
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని సిపిఐ 24వ జాతీయ మహాసభ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని విజయవాడలో జరిగిన సిపిఐ జాతీయ మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను 2014లో ఎపి, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించారని, పునర్విభజన చట్టంలో ఇరు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తీర్మానం విమర్శించింది. పునర్విభజన చట్టంలో తెలంగాణకు బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, ట్రైబల్‌ యూనివర్సిటీ, ఐఐఎం తదితర విద్యా సంస్థల ఏర్పాటుకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేసింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments