సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శ
ప్రజాపక్షం/హైదరాబాద్ : గతంలో ముఖ్యమంత్రిగా గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకించిన మోడీనే ప్రధాని అయ్యాక అదే గవర్నర్ వ్యవస్థతో విపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్ భవన్‌ను బిజెపి భవన్‌గా మార్చారని, గవర్నర్ బిజెపి కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఛలో రాజ్ భవన్ కార్యక్రమం సందర్భంగా బుధవారం అరెస్టుకు ముందు ఖైరతాబాద్ చౌరస్తాలో కూనంనేని మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ 2013 సంవత్సరంలో గవర్నర్ వ్యవస్థతో ఉపయోగం లేదని లోకాయుక్తకు లేఖరాశారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర శాసనసభ అమోదించిన బిల్లులను అమోదించకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని అన్నా రు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్రం గవర్నర్‌లతో ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో గవర్నర్‌లు రాష్ట్ర ప్రభుత్వాలకు పాలనలో అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. గవర్నర్ వ్యవస్థపై సుప్రీం కోర్టు కూడా మందలించిందన్నారు. సర్కారియా కమిషన్ గవర్నర్ వ్యవస్థ అనవసరమైందని నివేదిక ఇచ్చిందన్నారు. జనతా హయంలో గవర్నర్‌లను తొలగిస్తే అనంతరం వచ్చిన సర్కార్ తిరిగి గవర్నర్ వ్యవస్థను తీసుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం విపక్ష పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలపై ఐటి, ఈడి, సిబిఐలతో పాటు గవర్నర్‌లను ప్ర యోగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలకులు వదిలేసిన అవశేషమే గవర్నర్ వ్యవస్థ అని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో గవర్నర్ వ్యవస్థ అనవసరమైందన్నారు. పదవీ ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమాలు తప్పా గవర్నర్ వ్యవస్థ దేనికీ పనికిరాకుండా పోయిందన్నారు. మానవ శరీరంలో అపెండెక్స్ లాంటిదన్నారు. అపెండిక్స్‌కు కదలిక లేకపోతే ఏమికాదని, లేదంటే అది మానిషి ప్రాణాలను తీసుకుంటుందన్నారు. కాబట్టి అపెండిక్స్ లాంటి గవర్నర్ వ్యవస్థను రద్దుచేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులపై కేంద్రం సిబిఐని ప్రయోగిస్తుందన్నారు. టిడిపికి చెందిన సుజాన చౌదరి, సి.ఎం.రమేష్‌లు బిజెపి కండువలు కప్పుకోగానే సత్యహరిచంద్రులుగా మారిపోయా రా ? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని కూనంనేని డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థ రద్దు చేసేంత వరకు పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న కేంద్రం : సయ్యద్ అజీజ్ పాషా
గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా అన్నారు. విపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చేందుకు గవర్నర్‌లను కేంద్రం ఉపయోగించుకుంటుందన్నారు. సుప్రీం కోర్టు, సర్కారియా కమిషన్‌లు గవర్నర్ వ్యవస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం మాత్రం కొనసాగిస్తుందన్నారు. ఎలాంటి ఉపయోగం లేదని, గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని అజీజ్ పాషా డిమాండ్ చేశారు.
కేంద్రానికి తాబేదార్లుగా వ్యవహరిస్తున్న గవర్నర్లు : చాడ వెంకట్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్లు తాబేదార్లుగా వ్యవహరిస్తున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలపై మోడీ సర్కార్ ఈడి, ఐటి, సిబిఐలతో పాటు గవర్నర్‌లను ఉపయోగిస్తుందన్నారు. గవర్నర్‌లను ఉపయోగించి దేశంలో అనేక ప్రభుత్వాలను కేంద్రం కూల్చేసిందన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూల్చడంలో గవర్నర్‌ల పాత్రే కీలకంగా మారిందన్నారు. శాసనసభ అమోదించిన బిల్లులను కూడా గవర్నర్ అమోదించకుండా అపుతుందన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. తమిళనాడు బిజెపి అధ్యక్షురాలుగా పనిచేసిన తమిళిసై, ఇక్కడ కూడా బిజెపి కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి చీడలా మారిన గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందేనని చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. గవర్నర్ వ్యవస్థ రద్దు కోసం దేశ వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.