నేడు చివరి కక్షలోకి అంతరిక్ష నౌకను ప్రవేశపెట్టనున్న ఇస్రో
బెంగళూరు: సూర్యునిపై అధ్యయనానికి ఉద్దేశించిన భారత తొలి అంతిరక్ష నౌక ఆదిత్య ఎల్1 తన లక్ష్యానికి మరింత చేరువైంది. సూర్యునిపై అధ్యయనం చేసే ఈ మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ అబ్జర్వేటరీని– భూమికి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని దాని చివరి గమ్యస్థాన కక్ష్యలోకి శనివారం ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలు పూర్తి చేసుకుంది. ఇస్రో అధికారులు అందించిన సమాచారం ప్రకారం, సూర్యుడికి అతి సమీపంలోని లాగ్రాంజ్ పాయింట్ 1 చుట్టూ ఒక శూన్యమైన కక్షలోకి ఆదిత్య ఎల్1ను ప్రవేశపెడతారు. లాగ్రాంజ్ పరిధిని దాటి సూర్యు ని దిశగా అంతిరక్ష నౌకలేవీ ముందుకు వెళ్లలేవు. లాగ్రాంజ్ పాయింట్ 1ను సూక్ష్మంగా ఎల్1 అని వ్యవహరిస్తారు. ఇది భూమి, సూర్యుడికి మధ్య ఉన్న మొత్తం దూరంలో ఒక శాతం మాత్రమే. ఎల్ పాయింట్ చుట్టూ ఉన్న శూన్యమైన ఆర్బిట్ నుంచి సూర్యుడి గమనాన్ని, సౌర వాతావరణాన్ని గ్రహణాలు లేదా ఇతర అవాంతరాలు ఏవీ లేకుండా వీక్షించడానికి వీలుంటుంది. ఆదిత్య ఎల్1ను అందుకే, ఆ కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ నౌక సౌర కార్యకలాపాలను, నిజ సమయంలో అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి అవసరమైన సమాచారాన్ని పంపుతుంది. హాలో ఆర్బిట్‌లోకి ఆదిత్య ఎల్1ను ప్రవేశపెట్టకపోతే, నేరుగా సూర్యుడి దిశగా ప్రయాణాన్ని కొనసాగించి, భస్మమయ్యే ప్రమాదం ఉందని ఇస్రో అధికారి ఒకరు పిటిఐకి చెప్పారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్వి సి57)ను గత ఏడా ది సెప్టెంబర్ 2న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డిఎస్సి) రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఇస్రో ప్రయోగించింది. ఆదిత్య ఎల్1ను ఈ వాహన నౌక అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. 63 నిమిషాల 20 సెకన్ల విమాన వ్యవధి తర్వాత, ఆదిత్య ఎల్ విజయవంతంగా భూమి చుట్టూ 235×19500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అనేక అడ్డంకులను సమర్థంగా ఎదుర్కొంటూ, ఆటుపోట్లను తట్టుకుంటూ ఆదిత్య ఎల్1 తన గమ్యంవైపు దూసుకెళ్లింది. భూగోళ ప్రభావం నుంచి బయపడి, ఎల్1 సమీపానికి చేరింది. ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యడి వలయం (కరోనా) బయటి పొరలను విద్యుత్ అయస్కాంత ఫీల్ డిటెక్టర్ల ద్వారా పరిశీలించడానికి వీలుగా ఈ అంతరిక్ష నౌక ఏడు పేలోడ్స్‌ను కలిగి ఉంటుంది. వీటిలో నాలుగు పేలోడ్స్ నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగతా మూడు పేలోడ్లు లాగ్రాంజ్ పాయింట్ ఎల్1వద్ద ఉన్న కణాలు, క్షేత్రాలను సునితంగా అధ్యయనం చేస్తాయి. తద్వారా అంతర్గ్రహాలలో ప్రగతిశీల సౌర వాతావరణ ప్రభావం గురించిన ముఖ్యమైన అధ్యయనాలను ఆదిత్య ఎల్1 అందిస్తుంది. సౌర్య వలయ ఉష్ణం, ద్రవ్యరాశి విడుదల, స్వేచ్ఛా ప్రజ్వలనం వంటి వివిధ లక్షణాలను గమనించి, సమీక్షించే అవకాశం ఇస్రోకు ఈ సమాచారం ద్వారా లభిస్తుంది.
గమ్యానికి చేరువలో ఆదిత్య ఎల్-1
RELATED ARTICLES