హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల్లో భాగంగా కమలనాథలు ప్రచారం ముమ్మరం చేశారు. ప్రచారపర్వంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ నెల 27న నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగే భారీ బహిరంగ సభల్లో, వచ్చే నెల 3న హైదరాబాద్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అమిత్ షా పర్యటన షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 24న రాత్రి 8 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న అమిత్‌షా 25న మధ్యాహ్నం 12 గంటలకు పరకాలలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా మధ్యాహ్నం 1:45కు నిర్మల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. 3:20 కి దుబ్బాక, 4:45కి మేడ్చల్‌లో జరిగే బహిరంగ సభలకు హాజరై తిరిగి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. 28న మళ్లీ హైదరాబాద్ చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు చౌటుప్పల్ సభకు హాజరవుతారు. అక్కడి నుంచి నేరుగా 3:45కి హిమాయత్ నగర్ లిబర్టీ, ముషీరాబాద్, అంబర్ పేట మీదుగా ఆర్‌టిసి క్రాస్ రోడ్ వరకూ సాగే రోడ్డుషోలో పాల్గొంటారు. సాయంత్రం 5:45కి ఎల్‌బినగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. తిరిగి మళ్లీ డిసెంబరు 2న అమిత్ షా రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు. 12 గంటలకు నారాయణపేటలో జరిగే సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 1:35కి ఆమనగల్‌లో కల్వకుర్తి సభ, 3 గంటలకు ఉప్పల్, మల్కాజిగిరి రోడ్‌షోలలో పాల్గొంటారు. సాయంత్రం 5:15కు కామారెడ్డిలో జరిగే బహిరంగ సభతో అమిత్ షా రాష్ట్ర పర్యటన పూర్తి అవుతుంది. మొత్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు దిశానిర్దేశం, ప్రచారం జరిగేలా రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. మోడీ, అమిత్ షాతో సహా పలువురు కేంద్రమంత్రులు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరై కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారు.
ఖరారైన కమలనాథుల పర్యటన
RELATED ARTICLES