హైదరాబాద్ సహా 8 నగరాల్లో లక్ష అసహజ మరణాలు
తాజా అధ్యయన నివేదిక స్పష్టీకరణ
న్యూఢిల్లీ : భారత్ గాలి కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. పీల్చే గాలిలో నాణ్యతా ప్రమాణాలు ఏటేటా క్షీణించిపోతున్నాయి. హైదరాబాద్ సహా ముంబయి, బెంగళూరు, కోల్‌కత, చెన్నై, సూరత్, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో 2005 నుండి 2018 మధ్యకాలంలో 13 ఏళ్ళలో గాలికాలుష్యం కారణంగా లక్షమంది అదనంగా అసహజ మరణాలకు గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 46 నగరాలలో ఉన్న గాలికాలుష్య మరణాలకు సంబంధించిన గణాంకాలలోని హెచ్చుతగ్గులను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సరిచేసిన సందర్భంగా ఈ అదనపు మరణాల లెక్క తేలింది. వీరంతా ఆరోగ్యంగా జీవించవలసిన తరుణంలో వృద్ధాప్యంవల్ల సహజమరణాలు పొందకుండా గాలి కాలుష్య సమస్య వల్ల అసహజంగా మరణించారు.ఒక తాజా అధ్యయన నివేదిక ఈ విషయం స్పష్టం చేసింది. గాలికాలుష్య గణాంకాలకు సంబంధించి ఆఫ్రికా,ఆసియా,మధ్యాసియా దేశాల్లోని 46 నగరాలలో సంభవించిన మరణాలలో ఉన్న హెచ్చుతగ్గులను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం సరిదిద్దింది. అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాల సహాయంతో వాటి ఆధారంగా శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి ఈ అదనపు మరణాల గురించి పేర్కొన్నారు. 2005 2018 మధ్యకాలంనాటి నాసా, యూరోపియన్ సేస్ ఏజన్సీలకు చెందిన ఉగ్రహాలను సాధనాలుగా ఉపయోగించి ఈ అధ్యయనంలో అదనపు గాలికాలుష్య మరణాల గణాంకాలను తేల్చిచెప్పారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో 24 వేల అసహజ మరణాలు సంభవిస్తే, ముంబయి, బెంగళూరు, కోల్‌కత,హైదరాబాద్,చెన్నై, సూరత్, పుణె,అహ్మబాద్‌లలో 1,00,000 మరణాలు సంభవించాయి. భారత్‌లో గాలి కాలుష్య పర్యవేక్షణ సంస్థలు అధికంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది. గతవారంలో ప్రచురితమైన “జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్”లో పత్రిక ఈ విషయం వెల్లడించింది. పట్టణ ప్రాంతాలలో శరవేగంగా గాలి నాణ్యత క్షీణించిపోతోందని, ఇది మానవాళి ఆరోగ్య జీవనానికి సవాలు విసురుతోందని ప్రపంచ శాస్త్రవేత్తల బృందం ఈ నివేదికలో స్పష్టం చేసింది. పౌరుల ఆరోగ్యానికి నేరుగా ప్రమాదం తెచ్చిపెట్టే విషకారక వాయువుల శాతం గాలిలో పెరిగిందని పరిశోధకులు కనుగొన్నారు. నైట్రోజన్ డై ఆకైడ్ (ఎన్‌ఓ2) 14 శాతం, 8 శాతం స్పష్టమైన కాలుష్య రేణువులు (ఎంపి 2.5) పెరిగాయి. అమ్మోనియా లెవెల్స్ 12 శాతం, ప్రతిక్రియాశీల కర్బనసంబంధమైన మిశ్రమాలు అస్థిరస్థాయిలో 11 శాతం మేరకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ బృందంలో ఉన్నారు. పీల్చేగాలిలో నాణ్యత శరవేగంగా క్షీణిస్తోందని, పరిశ్రమలు రోజు రోజుకూ పెరగడంవల్ల, వాటి కాలుష్యం పెరగడంవల్లనే ఇదంతా జరుగుతోందని నివేదిక పేర్కొంది. పరిశ్రమలు పెరగడంతోపాటు రోడ్ ట్రాఫిక్, నివాసిత ప్రాంతాలు, వ్యర్థ పదార్థాలను కాల్చివేస్తున్న సంఘటనలు పెరిగిపోవడం,చార్‌కోల్, బొగ్గును విపరీతంగా వినియోగించడం వంటి అనేక చర్యలు మానవులు పీల్చే గాలిలో కాలుష్యం పెరిగిపోవడానికి కారకాలుగా మారాయని తాజా అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. జీవ ద్రవ్యాలను బహిరంగంగా కాల్చివేసే చర్యలు బాగా పెరిగాయని, ఆసుపత్రి వ్యర్థాల కాల్చివేత కూడా పెరిగిందని,వ్యర్థ పదార్థాలు విపరీతంగా పెరిగాయని, గాలి కాలుష్య విజృంభణకు ఇది ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది. ఈ అధ్యయనానికి యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యుసిఎల్) కు చెందిన కార్న్ వోహ్రా లీడ్ ఆథర్‌గా పనిచేశారు. “వాతావరణంలో పీల్చే గాలి విషయంలో ప్రత్యేకించి నగరాలలో గాలి కాలుష్యానికి సంబంధించి మనం ఒక కొత్త కాలుష్య శకంలోకి ప్రవేశించాం,పైన పేర్కొన్న నగరాలలో మిగిలిన నగరాలతో పదేళ్లలో పోల్చి చూస్తే గత ఏడాది కంటే పీల్చే గాలిలో మరింత నాణ్యత క్షీణించింది” అరి వోహ్రా చెప్పారు. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలో పిహెచ్‌డి విద్యార్థులు ఈ అధ్యయనం చేశారని ఆయన పేర్కొన్నారు. “పైన పేర్కొన్న 46 నగరాలలోని 40 నగరాలలో జనాభా విస్ఫోటనం కారణంగా గాలి నాణ్యత క్షీణించింది, ఎన్‌ఓ2 (నైట్రోజన్ డైయాకైడ్) కాలుష్యం 40 నగరాల్లో 1.5 శాతం నుండి నాలుగు రెట్లు పెరిగితే, 33 నగరాల్లో పిఎం (కణరూప ద్రవ్యం) 2.5 గా నమోదైంది” అని తెలిపారు.
క్షీణిస్తున్న గాలి నాణ్యత
RELATED ARTICLES